TTD Latest News: ఈ ఏడాది గోశాలలో 43 గోవులు చనిపోయాయి, భూమనది ఫేక్ ప్రచారం- టీటీడీ ఈవో శ్యామలారావు
TTD Goshala News Update | టీటీడీ నిర్వహించే గోశాలలో ఆవులను సరిగ్గా చూసుకోవడం లేదని, భారీగా గోవులు చనిపోతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీటీడీ ఈవో శ్యామలారావు స్పందించారు.

TTD EO shyamala rao | టీటీడీ గోశాలలో ఆవులు చనిపోతున్నాయని, అయినా చర్యలు లేవని బోర్డు పట్టించుకోవడం లేదని వైసీపీ నేత, టీడీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఇటీవల ఆరోపణలు చేశారు. దీనిపై టీటీడీ ఈవో జే శ్యామలా రావు స్పందించారు. టీటీడీ గోశాలలో గోవులు మరణాలు నిజమే అన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చినెలలో 43 గోవులు చనిపోయాయని స్పష్టం చేశారు. గతంలో వైసిపి హయాంలో ఏడాదిలో 179 గోవులు చనిపోయాయని తెలిపారు.
ప్రస్తుతం టిటిడి గోశాలలో టిటిడి సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు. అనారోగ్యంతో, వృద్ధాప్యంతోనే గోవులు చనిపోతున్నాయి. మేం వాస్తవాలను ప్రస్తుతం చెబుతున్నాం. గతంలో లాగా గోశాలకు సంబంధించి వాస్తవాలను దాచిపెట్టాలని చూడటం లేదు. గత మూడు నెలల్లో 59 గోవులు పుట్టాయి. గోశాలలో మరణించిన ప్రతిగోవుకు పోస్టుమార్టం చేస్తున్నాం. ప్రస్తుతం గోశాలలో టిటిడి సిబ్బంది గోవులను పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
వైసిపి హయాంలో గోశాలలో ఎన్నో అక్రమాలు జరిగాయని, 2021 నుంచి 2024 వరకు విజిలెన్స్ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వైసిపి హయాంలో మరణించిన గోవుల సంఖ్యను గోప్యంగా ఉంచారు. గతంలో గోవులకు పురుగులు ఉన్న దానాను పెట్టారు. కాలం చెల్లిన మెడిసిన్స్ ను గోవులకు వాడారు. వ్యాధి సోకిన గోవులకు సైతం సరైన వైద్యం చేయలేదు. వైసిపి హయాంలో గోశాలలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. పురుగులతో నిండిపోయిన వాటిని మిశ్రమాలను తాగించారు. ఆ సమయంలో లేబుల్ లేని, నాణ్యత లేని మందులను గోవులను వాడారు. వ్యాధి సోకిన గోవులను సపరేట్ చేయకుండా మిగతా అన్ని గోవులతో కలిపేశారు. వైసిపి హయాంలో గోశాలలోకి విజిలెన్స్ వారిని అనుమతించలేదు. గతంలో ఉన్న గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి టిటిడి విజిలెన్స్ ను గోశాలలోకి రానివ్వలేదు. గోశాలలో వారి బాగోతం బయటపడుతుందని హరినాథరెడ్డి విజిలెన్స్ ను అడ్డుకున్నారు.
భూమన దానాలో 78 లక్షలు నొక్కేశారు..
భూమన కరుణాకర్ రెడ్డి గోవుల దానాలో 78లక్షల రూపాయల కమిషన్ నొక్కేశారు. గోశాలలో నిర్మాణాల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకున్నారు. గత పాలకమండలి గోశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రెండుసార్లు గోశాలలో అగ్నిప్రమాదాలు జరిగాయి. వైసిపి హయాంలోనే గోశాలను గోవధశాలగా మార్చారు. ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేసిన ఫోటోలన్నీ ఫేక్. ఎక్కడో చనిపోయిన గోవుల ఫొటోలు తీసుకొచ్చి టిటిడి గోశాల గోవులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. శ్రీవారి మనోభావాలు దెబ్బతినేలా మాజీ చైర్మన్ భూమన మాట్లాడారు.
గత టీటీడీ బోర్డుకు కమీషన్లు అందాయి.. త్వరలోనే చర్యలు
కల్తీ నెయ్యి కేసులో గత టిటిడి పాలకమండలి ఛైర్మన్లకు కమీషన్లు అందాయి. రూ.320కి నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుంది. వైష్ణవి డెయిరీ, ఎ.ఆర్.డెయిరీ నుంచి గత బోర్డుకు ముడుపులు అందాయి. కల్తీ నెయ్యితోనే ప్రసాదాలను తయారు చేశారు. ఈ విషయంలో ఇద్దరు టిటిడి ఉద్యోగులు గత పాలకమండలికి సహకరించారు. టిటిడి ఉద్యోగుల పాత్ర నిర్థారణ అయ్యింది. త్వరలోనే వారిపైన చర్యలు ఉంటాయని’ శ్యామలారావు స్పష్టం చేశారు.






















