Amaravati Breaking News: అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే
అమరావతి విస్తరణ.. మళ్లీ భూసేకరణ 2.O అంటున్న ప్రభుత్వం.. అసలు కథ ఏంటంటే...

ఒకపక్కన అమరావతి పనులు పునఃప్రారంభం కానుండగా మరోవైపు భూసేకరణ 2.0 కు రెడీ అవుతోంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం తీసుకున్న భూమి లో కొంత ప్రభుత్వ భవనాలకు, మరికొంత ప్రభుత్వ సంస్థలకు పోగా మిగిలిన దాన్ని ప్రవేటు సంస్థలకు లీజుకిచ్చి దాని నుంచి వచ్చే ఆదాయంతో అమరావతిని సెల్ఫ్ సస్టైన్డ్ కాపిటల్ గా రూపొందించాలని చంద్రబాబు చేస్తున్న ఆలోచన. అయితే దాని కోసం అమరావతిలో రోడ్ల వెడల్పు, కొండవీడు, పాలవాగు లాంటి కెనాల్స్ వెడల్పు ముందు అనుకున్న దాని కంటే పెంచడం , అమరావతికి నీటి సౌకర్యం కోసం అదనపు రిజర్వాయర్లను నిర్మించడం వీటితోపాటు అమరావతి రైల్వే లైన్ కోసం భూమి ఇంకా కావలసి ఉంది. వీటన్నిటి కోసం ప్రస్తుతం ఉన్న భూమికి అదనంగా భూసేకరణ జరపాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం దానికోసం రెడీ అవుతోంది.
భూసేకరణ 2.0..ఎక్కడెక్కడ అంటే
గతంలో జరిగిన భూసేకరణలో తుళ్లూరు మండలంలోని హరిచంద్రపురం, ఒడ్డి మాను, పెద్ద పరిమి గ్రామాలను మినహాయించారు. వారు ఎప్పటి నుండో తమ గ్రామాలను అమరావతి పరిధిలోకి తేవాలని కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం జరుగబోతున్న భూసేకరణ 2.0 లో ఈ గ్రామాలకు తొలి ప్రాధాన్యత దక్కబోతోంది. ఇవి కాక తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలను కూడా అమరావతి పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేయబోతోంది ప్రభుత్వం. అయితే ఇది హడావుడి గా కాకుండా ఆయా గ్రామస్తుల పూర్తి సహకారం తో జరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే తమకు తాముగా ముందుకు వచ్చే గ్రామాల నుండి భూ సేకరణ జరపాలని అంతర్గత చర్చలు సాగుతున్నాయి.
2019 లోనే ప్రపోజల్
అమరావతి భూసేకరణ 2.0 అనేది ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చిన అంశం కాదు.. 2019 ఎన్నికలకు ముందు ఫిబ్రవరి లో జరిగిన క్యాబినెట్ సమావేశాల్లోనే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనిపై చర్చించింది. అప్పుడే దీనికి భూసేకరణ 2.0 అని పేరు పెట్టారు. ఆరేళ్ల తర్వాత ఇది మళ్ళీ తెరపైకి వచ్చింది. భూసేకరణ జరపడం పక్కా అని కాకపోతే ఏ ఏ గ్రామాలు అనేదానిపై ప్రస్తుతానికీ ప్రపోజల్ స్థాయిలోనే ఉన్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ అనవసరమైన వివాదాలు, లీగల్ చిక్కులు లేకుండా అమరావతి భూసేకరణ 2.0 ను సజావుగా చేస్తామని ఆయా వర్గాలు ABP దేశం కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ సమాచారం.





















