Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తప్పిన ముప్పు, ముందుగానే ముంబైలో కాలుపెట్టిన ఆరెంజ్ టీమ్
SRH Team Out of Park Hyatt After Fire Accident | సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ముప్పు, తప్పింది. వారు బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ముందుగానే ముంబైలో కాలుపెట్టింది ఆరెంజ్ టీమ్.

Sunrisers Hyderabad News | సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ టీమ్ బస చేస్తున్న హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్‌లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడటంతో చుట్టుప్రక్కల సైతం దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు జరిగే సమయంలో పార్క్ హయత్‌లోనే బస చేస్తుంది. ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో ఛేజ్ చేసి రెండో విజయాన్ని సన్‌రైజర్స్ తమ ఖాతాలో వేసుకుంది. సన్‌రైజర్స్ జట్టు తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 17న ముంబైతో తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుందని తెలిసిందే. దాంతో సన్‌రైజర్స్ ఇంకా హైదరాబాద్‌లోనే బస చేస్తోంది. సరిగ్గా వారు బస చేస్తున్న పార్క్ హయత్ హోటల్‌లో సోమవారం అగ్నిప్రమాదం జరగడంతో ఆందోళన మొదలైంది. అందులో టీమిండియా ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ విదేశీ క్రికెటర్లు, దేశవాలీలో సత్తా చాటి ఐపీఎల్ సన్‌రైజర్స్ జట్టులో చోటు దక్కించుకున్న వాళ్లు ఉన్నారు.
సన్‌రైజర్స్ టీమ్ సేఫ్
అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ అప్రమత్తం అయింది. ముందుగా హోటల్ నుంచి వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు. హోటల్ లో మంటలు చెలరేగగా, క్రికెటర్లతో పాటు సన్‌రైజర్స్ సపోర్టింగ్ స్టాఫ్ హోటల్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం సన్‌రైజర్స్ జట్టును ఎయిర్ పోర్టుకు తరలించినట్లు సమాచారం. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ముంబైకి ఆరెంజ్ ఆర్మీ టీమ్ బయలుదేరింది.
అగ్నిప్రమాదం నుంచి సన్‌రైజర్స్ క్రికెటర్లు, స్టాఫ్ సురక్షితంగా బయటపడటంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే సన్‌రైజర్స్ టీమ్ ముంబైకి చేరుకుంది. సోమవారం మధ్యాహ్నం సన్ రైజర్స్ ఆటగాళ్లు ముంబై ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన వీడియోను ఆరెంజ్ ఆర్మీ పేజీలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
Mission Mumbai Indians 🎯 pic.twitter.com/X4brhI0Ja0
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) April 14, 2025





















