Salman Khan: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం - కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
Salman Khan Gets Threat Calls: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ ఓ వాట్సాప్ సందేశం రాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Bollywood Hero Salman Khan Gets Threatening Calls: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కండల వీరున్ని చంపేస్తామంటూ వర్లీ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు తాజాగా ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.
కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం
సల్మాన్ ఖాన్ (SalmanKhan) ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతామని.. లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ ఆ వాట్సాప్ మెసేజ్‌లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న ముంబయి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెసేజ్ పంపిన వ్యక్తి ఎవరో కనిపెట్టే పనిలో పడ్డారు. అయితే, సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి గత కొంతకాలంగా హెచ్చరికలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయనకు బెదిరింపులు రావడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: మనుషుల మధ్య అర్జున్, మృగాల మధ్య సర్కార్ - నాని 'హిట్ 3' ట్రైలర్ గూస్ బంప్స్ అంతే!
ఇంతకు ముందు కూడా..
అయితే, సల్మాన్‌కు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. గతేడాది సల్మాన్ ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అంతకు ముందు కూడా పన్వేల్ ఫామ్ హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించడం అప్పట్లో కలకలం రేపింది. సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువైన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. ఈ క్రమంలో ఆయన భారీ భద్రత మధ్య షూటింగ్స్, ఈవెంట్స్‌కు హాజరవుతున్నారు.
బాబా సిద్ధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సల్మాన్ భద్రతపై పోలీసులు సహా సన్నిహత వర్గాలు సైతం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. దాదాపు రూ.2 కోట్ల బుల్లెట్ ప్రూఫ్ కారును ఆయన వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
'దేవుడే అన్నీ చూసుకుంటాడు'
సల్మాన్ ఖాన్ ఇటీవల 'సికిందర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తనకు వస్తోన్న బెదిరింపు మెసేజ్‌లు, కాల్స్‌పై ఆయన స్పందించారు. తాను దేవుడిని నమ్ముతానని.. ఆయనే అన్నీ చూసుకుంటాడని అన్నారు. 'ఆయుష్షు ఉన్నంత వరకూ ఈ భూమి మీద జీవిస్తాను. నాకు ఇటీవల బెదిరింపు కాల్స్ చాలా వచ్చాయి. దీంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు ఈ భద్రత కూడా నాకు సవాల్‌గా అనిపిస్తుంది. అలాంటి కాల్స్ ఎన్ని వచ్చినా నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడతాడు. ఆయనే అన్నీ చూసుకుంటాడు.' అని అన్నారు. తాజాగా మరోసారి బెదిరింపులు రాగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ మూవీ 'సికిందర్'. మార్చి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సల్మాన్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. మూవీలో కాజల్ అగర్వాల్ కీలక పాత్ర పోషించగా.. ప్రముఖ నటుడు సత్యరాజ్ నెగిటివ్ రోల్‌లో నటించారు.





















