Tirumala: నారదుడిపై అలిగిన తుంబురుడిని శ్రీవారు బుజ్జగించిన ప్రదేశం ఇది.. తిరుమల వెళితే మిస్సవకండి!
Tumburu Theertha Mukkoti : తిరుమల శేషాచలం అడవుల్లో ప్రముఖ తీర్థంగా వెలుగుతోంది తుంబురు తీర్థం. పౌర్ణమి సందర్భంగా జరిగిన ముక్కోటిలో దాదాపు 14,500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.

Tirumala Tumburu Theertha : తిరుమల శ్రీవారి ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబురు తీర్థం. పురాణ ప్రాశస్త్యం ప్రకారం తిరుమల శేషగిరుల్లో మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలు ఉన్నాయని ప్రతీతి. ఈ తీర్థాల్లో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదాయాన్ని కలిగించేవిగా ఏడు తీర్థాలను చెబుతారు.
అవి 1.శ్రీవారి పుష్కరిణి 2.రామకృష్ణ తీర్ధం 3.ఆకాశగంగ 4.పాపవినాశనం 5.కుమారధార 6.తుంబుర తీర్ధం 7.పాండవ తీర్థం. తిరుమల గిరుల్లో ఉన్న ఈ పుణ్య తీర్థాల్లో ఏడాదికి ఓసారి కొన్ని పుణ్యఘడియలు ప్రవేశిస్తాయి. ఈ సమయంలో ఆయా తీర్థాల్లో ముక్కోటి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ పుణ్య ఘడియల్లో తుంబుర తీర్ధంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి ముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఈ ఏడాది ఏప్రిల్ 12న ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందుకోసం టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 11న 3 వేల 500 మంది, ఏప్రిల్ 12న 11వేల మంది భక్తులు తుంబురు తీర్థంలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా TTD పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 5 గంటల నుంచి నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు భక్తులకు పంపిణీ చేశారు. ఇంజినీంగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు.
దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్తమా, స్థూల కాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య ఉండడంతో ప్రైవేట్ వాహనాలు కాకుండా కేవలం RTC బస్సుల్లో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వచ్చారు అధికారులు. తుంబురు తీర్థం, పాపావినాశనం వద్ద పారిశుద్ధ్యం కోసం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు అంబులెన్స్‌లను, పారామెడికల్ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు TTD భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. TTD కల్పించిన అన్నప్రసాదాలు, తాగునీరు, ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ప్రదేశంలోనే తుంబురుడు తపస్సు చేశాడని.. దట్టమైన అటవీ ప్రాంతంలో తుంబురు కోన కొండ రెండుగా చీలి దారి ఇచ్చినట్లు చెబుతారు. నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు ఆలపించడంతో అలిగిన తుంబురుడు ఈ తీర్థంలో ఉండిపోయాడట. స్వయంగా శ్రీ వేంకటేశ్వరుడు దిగివచ్చి తుంబురుడిని బుజ్జగించారని అందుకే ఈ ప్రాంతానికి తుంబురుతీర్థం అని పేరొచ్చిందని చెబుతారు. శ్రీవారి పరమ భక్తురాలైన తరిగొండ వెంగమాంబకు ఈ తీర్థంలోనే శ్రీవారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

