యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
1xBet బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ భారీ చర్యలు తీసుకుంది. పలువురు సినీ నటులు, క్రికెటర్లకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ భారీ చర్యలు చేపట్టింది. ఈడీ కోట్లాది రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. ఆస్తులు అటాచ్ అయిన వారిలో యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ఉర్వశి రౌతేలా, సోనూ సూద్, మిమీ చక్రవర్తి, అంకుష్ హజ్రా, నేహా శర్మ ఉన్నారు.
- యువరాజ్ సింగ్ - 2.5 కోట్లు
- రాబిన్ ఉతప్ప - 8.26 లక్షలు
- ఉర్వశి రౌతేలా - 2.02 కోట్లు (ఈ ఆస్తి వీరి తల్లి పేరు మీద ఉంది..)
- సోనూ సూద్ - 1 కోటి..
- మిమీ చక్రవర్తి - 59 లక్షలు
- అంకుష్ హజ్రా - 47.20 లక్షలు
- నేహా శర్మ - 1.26 కోట్లు
ఈడీ నేటి చర్యలో భాగంగా 7.93 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది..
ఇంతకుముందు ఇదే కేసులో ఈడీ శిఖర్ ధావన్ ఆస్తులను 4.55 కోట్ల రూపాయలు జప్తు చేసింది.
సురేష్ రైనా ఆస్తులను 6.64 కోట్ల రూపాయలు అటాచ్ చేసింది.
ఇప్పటివరకు 1x బెట్ కేసులో ఈడీ 19.07 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.
కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
కేసు ఏమిటి
ఈడీ దర్యాప్తులో 1xBet, దాని ఇతర బ్రాండ్లు 1xBat, Sporting Lines భారతదేశంలో ఎటువంటి అనుమతి లేకుండా ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయని తేలింది.
ఈ సెలబ్రిటీలు విదేశీ కంపెనీలతో ఎండార్స్‌మెంట్ అంటే ప్రకటనల ఒప్పందాలు చేసుకున్నారని, 1xBet ప్రమోషన్ కోసం వీడియోలు, సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ప్రకటనలు చేశారని దర్యాప్తులో తేలింది.
డబ్బును విదేశీ మార్గాల ద్వారా మళ్లించారు
ఈ చెల్లింపులు నేరుగా భారతదేశంలో కాకుండా, అసలు మూలాన్ని దాచిపెట్టడానికి విదేశీ మార్గాల ద్వారా మళ్లించారు. ఈడీ ప్రకారం, ఈ డబ్బు అక్రమ బెట్టింగ్ ద్వారా సంపాదించిన డబ్బు, దానిని చట్టబద్ధం చేయడానికి ఈ ఒప్పందాలు చేసుకున్నారు.
ఈడీ దర్యాప్తులో 1xBet భారతదేశంలో బెట్టింగ్ కోసం వేలాది నకిలీ లేదా ఇతరుల పేర్లతో ఖాతాలను ఉపయోగించినట్లు తేలింది. ఇప్పటివరకు 6000కు పైగా ఇలాంటి ఖాతాలను గుర్తించారు. ఈ ఖాతాలలో బెట్టింగ్ డబ్బు జమ చేశారు, ఆపై డబ్బును ట్రాక్ చేయకుండా ఉండటానికి అనేకసార్లు వివిధ చెల్లింపు గేట్‌వేల ద్వారా బదిలీ చేశారు.
ఈడీ దేశంలోని నాలుగు చెల్లింపు గేట్‌వేలపై దాడులు నిర్వహించింది. ఇప్పటివరకు 60కి పైగా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. ఈ ఖాతాలలో సుమారు 4 కోట్ల రూపాయలను నిలిపివేశారు.





















