Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
Delhi man shot dead : కుటుంబ గొడవల్లో ఓ వ్యక్తిని బంధువులు కాల్చి చంపారు.అతని ఒంట్లో 69 బుల్లెట్లు లభ్యమయ్యాయి.

Delhi man shot dead over family fight: కుటుంబాల్లో గొడవలు ఉంటాయి. కానీ అవి హత్యల వరకూ రావడం అరుదు. అలా వస్తే ఎలా చంపాలో కూడా చూసుకోకుండా చంపేస్తారని మరోసారి నిరూపితమయింది. ఢిల్లీలోని ఓ కుటుంబంలో ఏర్పడిన గొడవల కారణంగా ఓ వ్యక్తి శరీరంలోకి 69 బుల్లెట్లు దింపి చంపేసిన ఘటన సంచలనంగా మారింది.
దక్షిణ ఢిల్లీలోని అయా నగర్ ప్రాంతంలో జరిగిన ఒక దారుణ హత్య ఉదంతం దేశ రాజధానిని ఉలిక్కిపడేలా చేసింది. పాత కక్షల నేపథ్యంలో రతన్ లోహియా అనే 52 ఏళ్ల డైరీ వ్యాపారిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో మృతుడి శరీరం నుంచి పోస్ట్‌మార్టం సమయంలో ఏకంగా 69 బుల్లెట్లను వెలికితీశారు. సాధారణంగా హంతకులు అయితే ఓ రెండు బుల్లెట్లు కాల్చేసి వెళ్లారు.కానీ ఇక్కడ మాత్రం శరీరం అంతా జల్లెడ పడేలా..కోపం అంతా తీర్చుకునేలా కాల్చుతూనే ఉన్నారు.
రతన్ లోహియా తన ఇంటి నుంచి డైరీ ఫామ్‌కు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన ముగ్గురు దుండగులు ఆయనను చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కారు నంబర్ ప్లేట్లను ముందుగానే తొలగించిన నిందితులు, రతన్ వచ్చే వరకు సుమారు అరగంట పాటు అక్కడే మాటు వేసి ఉన్నట్లు సిసిటివి ఫుటేజీ ద్వారా వెల్లడైంది. ఈ హత్య వెనుక రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరు , భూ వివాదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత మే నెలలో జరిగిన మరో హత్యకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం రంబీర్ లోహియా కుమారుడు అరుణ్ హత్యకు గురవగా, ఆ కేసులో రతన్ పెద్ద కుమారుడు దీపక్ అరెస్ట్ అయ్యాడు. అప్పటి నుండి రతన్ కుటుంబానికి నిరంతరం ప్రాణాపాయ హెచ్చరికలు అందుతున్నాయని మృతుడి సోదరుడు తెలిపాడు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితులు సుమారు 70 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. పోస్ట్‌మార్టం నివేదికలో రతన్ శరీరంలో 69 బుల్లెట్లు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఘటనా స్థలంలో పోలీసులు అనేక ఖాళీ షెల్స్ , పేలని తూటాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంత దారుణంగా హత్య చేయడం చూస్తుంటే, దీని వెనుక ప్రొఫెషనల్ కిల్లర్స్ లేదా గ్యాంగ్‌స్టర్ల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో సుమారు 12 నుండి 13 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఫరీదాబాద్ నుండి వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ప్రస్తుతం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.





















