Ambedkar Jayanti 2024: ఉద్యోగుల పని గంటల్ని తగ్గించింది అంబేడ్కర్ అని మీకు తెలుసా, ఇన్సూరెన్స్ కూడా ఆయన వల్లే
Ambedkar Jayanti 2024: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారత్‌లో వర్కింగ్ అవర్స్‌ని 8 గంటలకు తగ్గించడంతో పాటు కార్మికుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.
Dr Ambedkar Birth Anniversary 2024: రాజ్యాంగకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని (Ambedkar Jayanti 2024) రూపొందించడమే కాదు. అప్పటి వరకూ ఉన్న బ్రిటీష్ పాలన నాటి చట్టాల్ని, నిబంధనల్ని మార్చేశారు. చెప్పాలంటే...తన నిర్ణయాలతో చరిత్ర సృష్టించారు. ముఖ్యంగా కార్మికుల శ్రమని గుర్తించారు. వాళ్ల కష్టం వృథా కాకుండా తన వంతు సాయం తాను చేశారు. భారత్‌లో స్వాతంత్ర్యం రాకముందు వరకూ ఉద్యోగులందరూ రోజుకి 12-14 గంటల వరకూ కష్టపడేవాళ్లు. అప్పట్లో భారత్‌లోని కార్మికులంటే చాలా చౌకగా దొరుకుతారన్న చులకన భావం ఉండేది. అందుకే తక్కువ కూలీ ఇచ్చి ఎక్కువ గంటలు పని (Working Hours in India) చేయించుకునే వాళ్లు. బ్రిటీష్ పాలనలో ఇలా గొడ్డుచాకిరీ చేయడానికి అంతా అలవాటు పడిపోయారు.
ఈ చాకిరీ 1942 వరకూ కొనసాగింది. ఎప్పుడైతే బీఆర్ అంబేడ్కర్ వైస్‌రాయ్ కౌన్సిల్‌లో లేబర్ మెంబర్‌గా ఎన్నికయ్యారో అప్పటి నుంచే మార్పు మొదలైంది. 1942 నుంచి 1946 వరకూ ఈ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నారు అంబేడ్కర్. ఆ సమయంలోనే నీటిపారుదల, విద్యుత్ శాఖల్లో సంస్కరణలు తీసుకొచ్చారు. అప్పుడే కార్మిక రంగంలోనూ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో మొట్టమొదటిది పని గంటల్ని తగ్గించడమే. అప్పటి వరకూ 14 గంటల వరకూ ఉన్న వర్కింగ్ అవర్స్‌ని అంబేడ్కర్ 8 గంటలకు తగ్గించారు. ఇవాళ మన భారత్‌లో అన్ని సంస్థలూ 8 గంటల వర్కింగ్ అవర్స్‌ని ప్రామాణికం చేశాయి. అందుకు కారణం అంబేడ్కర్. 1942 నవంబర్‌లో న్యూ ఢిల్లీలో జరిగిన Indian Labour Conference సమావేశంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారాయన.
మరెన్నో మార్పులు..
కార్మికులు వివక్షకు గురవుతున్నారని గుర్తించిన అంబేడ్కర్ వాళ్ల సంక్షేమం కోసమే ఆలోచించారు. అందులో భాగంగానే పని గంటలు తగ్గించారు. అంతే కాదు. ఫ్యాక్టరీ వర్కర్స్‌కి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని చెప్పిందీ ఆయనే. అప్పటికి పాశ్చాత్య దేశాల్లో వారానికి 48 పని గంటల నిబంధన ఉంది. భారత్‌లోని కార్మికులకూ అదే రూల్ ఉండాలని తేల్చి చెప్పారు. ఇక కొంత మంది కార్మికులతో ఎక్కువ పని చేయించుకుని తక్కువ వేతనాలు ఇవ్వడాన్నీ తప్పుబట్టారు. ఆ సమయంలోనే Minimum Wages Act ని తీసుకొచ్చారు. 1948లో ఇదే చట్టంగా మారింది. ఓవర్ టైమ్ చేసిన వాళ్లకి ఆ మేరకు లెక్కగట్టి వేతనాలు అందించే విధంగా మార్పు తీసుకొచ్చింది కూడా అంబేడ్కరే.
Payment of Wages (Amendment) Bill ని 1944లో తీసుకొచ్చారు. వాళ్లకీ DA,లీవ్ బెన్‌ఫిట్స్, Revision of Scale Pay లాంటివి తీసుకొచ్చారు. సబ్సిడీపై ఆహారం అందించే పథకాన్నీ అమలు చేశారు. మెడికల్ లీవ్ తీసుకునే వెసులుబాటూ కల్పించారు. దేశంలోని అన్ని వర్గాల ఉద్యోగులకూ ఇన్సూరెన్స్ పాలసీలు అందించిన రికార్డు కూడా ఆయనదే. ఆసియాలో ఈ తరహా పాలసీ తీసుకొచ్చిన తొలి దేశంగా భారత్ అప్పట్లో రికార్డు సృష్టించింది. Employees State Insurance (ESI)ని ఆయనే ప్రవేశపెట్టారు. ఉద్యోగులకు మెడికల్ కేర్, మెడికల్ లీవ్ ఇవ్వడంతో పాటు పని చేస్తున్నసమయంలో ఏదైనా ప్రమాదానికి గురైతే వాళ్లకి పరిహారం అందించడం లాంటి నిబంధనలతో వాళ్ల సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అప్పటి ఆ ESI రూల్ ఇప్పటికీ అన్ని సంస్థల్లో కొనసాగుతోంది.
Also Read: ఆ పెయిన్ కిల్లర్స్‌తో జాగ్రత్త, ఇష్టమొచ్చినట్టు వాడకండి - కేంద్రం హెచ్చరికలు