Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
Telangana Latest News: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆపార్టీ సీనియర్ నేత తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులను ఇంత దారుణంగా వాడుకుంటున్నారని చేసిన కామెంట్స్ బిఆర్‌ఎస్‌కు అస్త్రంగా మారాయి.

Telangana Latest News: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే ప్రతిపక్షం అక్కర్లేదు. ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. సీనియర్లు అలుగుతారు. బహిరంగ ఆరోపణలు చేస్తారు. ఈ స్థాయిలో వేరే పార్టీ నేతలు కూడా చేయబోరు. అందుకే కాంగ్రెస్ నిత్యం కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి వనపర్తిలో మాట్లడుతూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఏకంగా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడే క్రమశిక్షణ తప్పారని కొందరంటే, ఉన్నది ఉన్నట్లు ధైర్యంగా మాట్లడారని మరికొందరంటున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సొంత పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంపైనే తీవ్ర ఆవేదనతో మండిపడ్డారు చిన్నారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యానికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న విధానం అద్దం పడుతోందని ఆరోపించారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది జీవన్ రెడ్డితో 90లక్షల రూపాయలు ఖర్చుపెట్టించారని అన్నారు. ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసిలకు, జడ్పిటిసిలకు ఒక్కొక్కరికి 5 నుంచి 10లక్షలు జీవన్ రెడ్డితో ఇప్పించి నిండా ముంచేశారని కామెంట్స్ చేశారు. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధాన ప్రతిపక్షం అయిన బిఆర్‌ఎస్‌కు ఆయుధంగా మారాయి. ఇదే అంశంపై మాజీ మంత్రి బిఆర్‌ఎస్ నేత హరీష్ రావు ఎక్స్ వేదికగా చిన్నారెడ్డి వీడియోను పోస్ట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు.
ఇందిరమ్మ రాజ్యం.. పోలీసు రాజ్యమైందని, మా కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయన్న మా ఆరోపణలు వాస్తవమని కాంగ్రెస్ నాయకుడైన చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది.
— Harish Rao Thanneeru (@BRSHarish) February 25, 2025
‘‘పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలి కారుల్లాగా పని చేస్తున్నారు.… pic.twitter.com/183xi9Tnok
ఇందిరమ్మ రాజ్యం.. పోలీసు రాజ్యమైంది, మా కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. ఈ ఆరోపణలు వాస్తవమని కాంగ్రెస్ నాయకుడైన చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నది. అని హరీష్ రావు మండిపడ్డారు. ఆయన పోస్టు చేసిన పోస్టులో ఏముందంటే...‘పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలికారుల్లాగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యే కేసు పెట్టుమంటే పెట్టాలె, తీసేయమంటే తీసేయాలె అనే స్థాయికి దిగజారారు. గతంలో ఎన్నడూ ఒక ఎమ్మెల్యేకు అధికారులు ఇంతగా భయపడిన దాఖలాలు లేవు. నా 46ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణంగా పోలీసులు, అధికారులు ఎన్నడూ ప్రవర్తించలేదు’’ అని చిన్నారెడ్డి బహిరంగంగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ ముందు నుంచి చెబుతున్నది నిజమేనని నాడు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నేడు వనపర్తిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు, అధికారుల తీరు ఇట్లా ఉంటే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో నోట్ల రాజకీయం నగ్న తాండవం చేస్తోందని చిన్నారెడ్డే అంగీకరించారు.మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 5నుంచి 10లక్షల వరకు ఇస్తామని హామీ ఇచ్చి, రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చారని చిన్నారెడ్డి చెప్పడం బీఆర్‌ఎస్‌కు మంచి అస్త్రం ఇచ్చినట్టు అయింది.
Also Read: తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
చిన్నారెడ్డి చేసిన కామెంట్స్‌ను హరీష్ పోస్టు చేస్తూ..."ఈడీలు, సీబీఐలు, ఐటీలు, ఎన్నికల్ కమిషన్లు ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదు? బీఆర్ఎస్ నాయకులపై నిరాధారమైన కేసులు పెట్టటంలో చూపించే అత్యుత్సాహం ఆధారాలున్నా, స్వయంగా క్యాబినెట్ ర్యాంకులో ఉండి, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడే చెబుతున్నా ఎందుకు పెట్టడం లేదు? కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా? రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారు? బడే భాయ్, ఛోటే భాయ్ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బిజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం." అని సోషల్ మీడియా వేదికగా సవాల్ చేశారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 5నుంచి 10లక్షల వరకు ఇస్తామని హామి ఇచ్చి, రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చారని చిన్నారెడ్డి గారు బట్టబయలు చేసారు.… pic.twitter.com/nOQY5JCX61
— Harish Rao Thanneeru (@BRSHarish) February 25, 2025
ఇలా చిన్నారెడ్డి చేసిన కామెంట్స్‌ను ఆయుధంగా చేసుకొని రేవంత్ రెడ్డి సర్కాను మాజీ మంత్రి బిఆర్ ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మాపై కేసులు పెట్టి, అరెస్టులు చేసే రేవంత్ రెడ్డి , ఇప్పుడు తమ పార్టీ సీనియర్ నేత బహిరంగంగా చేసిన ఆరోపణలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీపార్టీలో ఓట్లు కొనేందుక కోట్లు ఖర్చు చేసారని మీ పార్టీ నేత చెబుతుంటే ఎందుకు కేసులు కట్టరని నిలదీశారు. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోరని డిమాండ్ చేసారు హరీష్ రావు. మొత్తానికి సొంత పార్టీలో చిన్నారెడ్డి పెట్టిన చిచ్చుతో బిఆర్‌ఎస్ అస్త్రాలు సంధిస్తోంది.
Also Read: ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

