ఆ పెయిన్ కిల్లర్స్‌తో జాగ్రత్త, ఇష్టమొచ్చినట్టు వాడకండి - కేంద్రం హెచ్చరికలు
Nimesulide:పెయిన్ కిల్లర్స్ వినియోగాన్ని తగ్గించకపోతే ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది.
Nimesulide Drug Usage: కాస్తంత బాడీ పెయిన్స్ వచ్చాయంటే చాలు వెంటనే మనం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం. ఇది అప్పటికి ఉపశమనం ఇచ్చినా లాంగ్‌టర్మ్‌లో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే కొన్ని డ్రగ్స్ వినియోగంపై ఎప్పటికప్పుడు వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇప్పుడు Indian Pharmacopoeia Commission (IPC) కూడా ఓ పెయిన్ కిల్లర్ వాడకంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అందరూ చాలా తరచూ వినియోగించే పెయిన్ కిల్లర్స్‌తో వచ్చే దుష్ఫ్రభావాల గురించి హెచ్చరించింది. ఈ Cefuroxime, Nimesulide మెడిసిన్ ఉన్నాయి. ఈ డ్రగ్స్‌ని వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. బ్యాక్టీరియా ఇనెక్షన్‌లను తగ్గించే Cefuroxime డ్రగ్‌ని యూరినరీ ఇన్‌ఫెక్షన్, గైనకాలజీ ఇన్‌ఫెక్షన్‌తో పాటు, స్కిన్, టిష్యూ ఇన్‌ఫెక్షన్స్‌కి ఎక్కువగా వాడతారు. న్యుమోనియాకీ ఈ మందుని వినియోగిస్తారు. అయితే...ఈ డ్రగ్‌ని ఎక్కువ రోజుల పాటు వాడితే శరీరంపై పెద్ద పెద్ద దద్దులు వచ్చే ప్రమాదముంది. వీటిని మెడికల్ పరిభాషలో pustulesగా పిలుస్తారు. GSK తోపాటు Mankind Pharma, Glenmark Pharmaceuticals ఈ మెడిసిన్‌ని తయారు చేస్తున్నాయి. వీలైనంత వరకూ ఈ డ్రగ్ వినియోగాన్ని తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
దీంతో పాటు Nimesulide పెయిన్ కిల్లర్ గురించీ హెచ్చరికలు చేసింది. జ్వరం, ఇన్‌ఫెక్షన్ తగ్గించేందుకు ఈ మందు వాడతారు. జాయింట్ పెయిన్స్, ర్యుమటాయిడ్ ఆర్థిరిటిస్‌కీ వినియోగిస్తారు. ఆర్థోపెడిక్, ENT,డెంటల్‌తో పాటు ఆపరేషన్ తరవాత పెయిన్ తగ్గేందుకూ ఈ Nimesulide మెడిసిన్‌ని ప్రిస్క్రైబ్ చేస్తుంటారు వైద్యులు. ఈ Nimesulide డ్రగ్‌ని విపరీతంగా వినియోగిస్తే Fixed Drug Eruption (FDE) కి గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది Indian Pharmacopoeia Commission. స్కిన్ అలెర్జీ వస్తుందని తేల్చి చెప్పింది. వైద్యుల సలహాలు సూచనలు లేకుండా పెయిన్ కిల్లర్స్‌ని వాడితే చాలా సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బరువు తక్కువగా ఉన్న వాళ్లు, గర్భిణులు, ఆస్తమా, ఫిట్స్, అలెర్టీ తదితర వ్యాధులున్న వాళ్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Codeine డ్రగ్ ఉన్న పెయిన్ కిల్లర్స్‌ని వైద్యుల సలహా లేకుండా మూడు రోజుల కన్నా ఎక్కువ వాడకూడదు. పది రోజుల పాటు ఇదే డ్రగ్‌ని తీసుకుంటే కడుపు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదముంది.
యాంటీబయోటిక్స్ వినియోగంపైనా గతంలో కేంద్రం హెచ్చరికలు చేసింది. ఈ మెడిసిన్ వాడకం భారత్‌లోనే అత్యధికంగా ఉందంటూ అప్పట్లో ఓ రిపోర్ట్ సంచలన విషయం వెల్లడించింది. ఇండియన్స్ మరీ పప్పులు మింగినంత సింపుల్‌గా యాంటీ బయోటిక్స్ వాడుతున్నారని చెప్పింది. అయితే...కొవిడ్ సమయంలో చాలా మంది యాంటీబయోటిక్స్ వాడకానికి అలవాటు పడ్డారు. పారాసిటమాల్‌తో పాటు ఎక్కువ మొత్తంలో మెడిసిన్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పటి ఎఫెక్ట్ ఇప్పటికీ కొందరిలో కనిపిస్తూనే ఉంది. నీరసం, తలనొప్పి, అప్పుడప్పుడు కీళ్ల నొప్పుల లాంటి సమస్యలతో బాధ పడుతున్నారు. అందుకే యాంటీబయోటిక్స్ వినియోగాన్ని వీలైనంత వరకూ తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిని ఎక్కువగా వాడితే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.