దేశ ప్రజలందరికీ సమాన హక్కులుండాలనే లక్ష్యంతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారు. న్యాయం, స్వేచ్ఛ, సోదరభావం అనే సిద్ధాంతాలను నమ్మిన అంబేడ్కర్ వల్లే దేశంలో సామాజిక సంస్కరణలు సాధ్యమయ్యాయి. అందరూ చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని, ఆర్థిక స్థిరత్వానికీ ఇదే కీలకమని బలంగా విశ్వసించారు అంబేడ్కర్. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన అంబేడ్కర్ ఆర్థిక శాస్త్రంలో ఎంతో నైపుణ్యం సాధించారు. అణగారిన వర్గాలపై ఉన్న వివక్షని నిరసించిన అంబేడ్కర్ జయంతిని ఈక్వాలిటీ డే గా జరుపుకుంటారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి రాజ్యాంగ నిర్మాత వరకూ ఎదిగిన ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగుల పని గంటల్ని 14 నుంచి 8 గంటలకు తగ్గించిన ఘనత అంబేడ్కర్‌దే. కార్మికుల సంక్షేమం కోసం ఆయన ఎంతో తపించారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత తొలి కార్మిక మంత్రిగా పని చేశారు. ఆయన హయాంలో కార్మిక చట్టాల్లో ఎన్నో సంస్కరణలు వచ్చాయి.