Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
Veera Dheera Soora Movie: తనకు తెలుగులో తగిన స్క్రిప్ట్ రాలేదని.. అందుకే తెలుగులో డైరెక్ట్‌గా మూవీ చేయలేదని చియాన్ విక్రమ్ అన్నారు. ఆయన లేటెస్ట్ మూవీ 'వీర ధీర శూర' ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది.

Chiyaan Vikram About Direct Telugu Movie: తెలుగులో తనకు సరైన స్క్రిప్ట్ రాని కారణంగానే డైరెక్ట్ గా తెలుగులో మూవీ చేయలేదని కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తెలిపారు. ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ యాక్షన్ మూవీ 'వీర ధీర శూర' (Veera Dheera Soora) ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం తాజాగా తెలుగు మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఓటీటీలపైనా విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అందుకు రెండే కారణాలు..
తాను తెలుగులో మూవీస్ చేయకపోవడానికి రెండే ప్రధాన కారణాలని విక్రమ్ తెలిపారు. 'నాకు తగిన స్క్రిప్ట్ రాలేదు. ఇప్పుడు భాషతో సంబంధం లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా పేరొందింది. పాన్ ఇండియా లెవల్ సినిమాల వల్ల నేను తమిళంలో చేసిన మూవీస్ ఇక్కడ చూస్తున్నారు. తెలుగులో వచ్చిన సినిమాలను నేను ఓటీటీలో తమిళంలో చూస్తున్నాను. ఇప్పుడు ఎవరూ డబ్బింగ్ పిక్చర్స్ చూడడం లేదు. అందరూ అన్నీ మూవీస్ సబ్ టైటిల్స్ చూస్తున్నారు.' అని చెప్పారు.
Also Read: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
ఓటీటీలకు థ్యాంక్స్
ఈ సందర్భంగా ఓటీటీలకు విక్రమ్ థ్యాంక్స్ చెప్పారు. సినిమాలకు ఓటీటీ ఇబ్బంది అని ఓ దశలో ఆలోచించామని.. కానీ అది ఓ బూస్ట్ అని అన్నారు. అన్నీ భాషల్లో, అన్నీ సినిమాలను ఓటీటీలోనూ చూస్తున్నారని.. తాను కూడా తెలుగు మూవీస్ సబ్ టైటిల్స్‌తో ఓటీటీలో చూశానని తెలిపారు. ఓటీటీ కారణంగా అన్ని భాషా చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఆదరిస్తున్నారని.. భాషతో ఎలాంటి సంబంధం లేదంటూ కామెంట్ చేశారు.
'నేను సూర్యకు పెద్ద ఫ్యాన్'
తాను ఎస్‌జే సూర్యకు (Sj Suryah) పెద్ద ఫ్యాన్ అని విక్రమ్ తెలిపారు. తాను హీరోగా సెటిల్ అవ్వకముందే సూర్య పెద్ద డైరెక్టర్ అయిపోయారని.. తామిద్దరం లయోలా కాలేజ్ చెన్నైలో చదువుకున్నామని చెప్పారు. ఆయన మూవీస్ అంటే తనకు చాలా ఇష్టమని.. సూర్య ఫస్ట్ మూవీ 'వాలి' తాను నటించిన 'సేతు' అవార్డుల్లో సైతం పోటీ పడ్డాయని వివరించారు. ఈ సందర్భంగా సూర్య మూవీ సమయంలో ఓ ఫన్నీ సీన్‌ను సైతం విక్రమ్ గుర్తు చేసుకున్నారు.
సూర్య హీరో.. నేను డైరెక్టర్
ఈ సందర్భంగా సూర్య, మీరు ఇద్దరూ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారని అడిగిన ప్రశ్నకు.. ఇద్దరూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం వస్తే ఇద్దరం కలిసి ఓ మూవీ చేస్తామని.. సూర్య హీరోగా తానే డైరెక్ట్ చేస్తానని విక్రమ్ చెప్పారు. దీనిపై స్పందించిన సూర్య తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని.. కచ్చితంగా ఇద్దరం కలిసి సినిమా చేస్తామని అన్నారు.
'వీర ధీర శూర' మూవీకి ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 27న రిలీజ్ కానుంది. సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ దుషారా విజయన్, ఎస్‌జే సూర్య, పాపులర్ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

