MM Keeravani: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
SSMB29 Movie: రాజమౌళి, మహేష్ బాబు 'SSMB29' మూవీ ఓ అడ్వెంచర్ అని దర్శకుడు కీరవాణి తెలిపారు. ఈ సినిమాకు సంగీతం అందించడం కష్టమే అయినా ఆసక్తికరం అని చెప్పారు.

Keeravani About SSMB29 Movie: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబో మూవీ 'SSMB29'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. దీనికి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా ట్రెండింగ్‌గా మారుతోంది. ఈ మూవీపై సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
'ఇలాంటి మూవీ ఇంతకు ముందు రాలేదు'
ఇలాంటి మూవీ ఇంతకు ముందెన్నడూ రాలేదని.. ఇప్పటివరకూ తాను పని చేసిన వాటిల్లో 'SSMB29' చాలా కష్టమైన ప్రాజెక్టు అని కీరవాణి తెలిపారు. తనకు ప్రతీ సినిమాకు సవాళ్లు పెరుగుతాయని.. దీనికి తగ్గట్లు కొత్త సౌండ్స్ సృష్టించాలని చెప్పారు. 'SSMB29 ఓ అడ్వెంచర్. ఇలాంటి మూవీ ఇంతకు ముందు రాలేదని అనుకుంటున్నా. ఈ మూవీకి మ్యూజిక్ కష్టమే అయినా ఆసక్తికర ప్రయాణం.' అని తెలిపారు. దీంతో మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉంటుందనే అంచనాలు నెలకొన్నాయి.
దాదాపు 3 దశాబ్దాల తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర' మూవీకి పని చేస్తున్నానని కీరవాణి తెలిపారు. బాలీవుడ్‌లో నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'తన్వి: ది గ్రేట్'కు స్వరాలు సమకూరుస్తున్నట్లు చెప్పారు. తనకు సంగీత వాయిద్యాల్లో పియానో అంటే చాలా ఇష్టమని అన్నారు. 'సంగీతం విషయంలో కేవీ మహాదేవన్, ఆర్.డి.బర్మన్ ప్రభావం తనపై ఎంతగానో ఉంది. వాళ్లిద్దరే కాకుండా కొత్తగా ప్రయత్నించే ప్రతి సంగీత దర్శకుడి నుంచి నేను నేర్చుకుంటూ ఉంటాను.' అని కీరవాణి స్పష్టం చేశారు.
ఒడిశాలో 'SSMB29' షూటింగ్ పూర్తి
మరోవైపు, గత కొద్ది రోజులుగా ఒడిశాలోని కోరాపుట్‌లో జరుగుతున్న 'SSMB29' మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తైంది. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన పలువురు అధికారులు ఇటీవల చిత్ర బృందాన్ని కలవగా.. మహేష్ బాబు వారితో ఫోటోలు దిగారు. ఈ క్రమంలోనే రాజమౌళి సైతం థ్యాంక్యూ నోట్ రిలీజ్ చేశారు. ఈ మూవీ షూటింగ్ జనవరిలో హైదరాబాద్‌లో మొదలుపెట్టగా.. సినిమా నుంచి ఎలాంటి లీక్స్ లేకుండా జక్కన్న కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఓ వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడంపై రాజమౌళి టీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాన్ని వెంటనే తొలగించింది. లీకులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
గ్లోబ్ ట్రాంటింగ్ జానర్ సినిమాగా 'SSMB29'ని రూపొందిస్తున్నామని దర్శకుడు రాజమౌళి ఇదివరకే చెప్పారు. హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీ ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఓ అడ్వెంచర్ డ్రామాగా మూవీ రూపొందుతోందని సమాచారం. సినిమాలో వారణాశి నేపథ్యంలో స్టోరీ, సీన్స్ సాగుతాయనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఓ భారీ సెట్‌ను సైతం క్రియేట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో స్టోరీ ఏమై ఉంటుందనే అంచనాలు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

