Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
OTT Review - Vikatakavi Web Series On Zee5: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ జంటగా నటించిన 'వికటకవి' వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉంది? అంటే...
ప్రదీప్ మద్దాలి
నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప తదితరులు
Zee5
Vikatakavi Web Series On Zee5: 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' వంటి సినిమాలతో గుర్తింపు, విజయాలు అందుకున్న యువ హీరో నరేష్ అగస్త్య. ఆయన నటించిన తాజా వెబ్ సిరీస్ 'వికటకవి'. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించారు. ఇందులో మేఘా ఆకాష్ హీరోయిన్. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ (Vikatakavi Streaming Platform) అవుతోందీ సిరీస్. 'పరువు' తర్వాత నరేష్ అగస్త్య, జీ5 కలయికలో వచ్చిన ఈ సిరీస్ మరో విజయం అందించేలా ఉందా? లేదా?
కథ (Vikatakavi Web Series Story): రామకృష్ణ (నరేష్ అగస్త్య) డిటెక్టివ్. అతనిది హైదరాబాద్. కొన్ని కేసులు పరిష్కరించడానికి, కేసుల్లో చిక్కుముడులు విప్పడానికి పోలీసులు సైతం అతని సహాయం తీసుకుంటారు. రామకృష్ణ తెలివితేటలు చూసి తమ ఊరిలో సమాధానం లభించని ప్రశ్నలకు, సమస్యలకు పరిష్కారం వెతికే సత్తా అతనికి ఉందని ఓ ప్రొఫెసర్ భావిస్తాడు.
రామకృష్ణ తల్లికి అరుదైన వ్యాధితో బాధ పడుతుంది. వర్షపు శబ్దం వింటే ఆమెలో అలజడి, భయం మొదలవుతాయి. తల్లికి ఆపరేషన్ చేయడానికి అవసరమైన డబ్బు వస్తుందన్న ఆశతో అమరగిరి సంస్థానానికి వెళతాడు రామకృష్ణ. అక్కడ దేవతల గుట్ట (కొండ) మీదకు రాత్రివేళల్లో వెళ్లిన జనాలు గతం మర్చిపోతారు. అమ్మోరు శాపం అని అమరగిరి ప్రజలు భావిస్తారు. అది నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి ఓ రోజు కొండ మీదకు వెళతాడు రామకృష్ణ. తర్వాత ఏమైంది? అనేది సిరీస్.
దేవతల గుట్ట మీదకు వెళ్లిన రామకృష్ణ ఏం తెలుసుకున్నాడు? అతను కూడా గతం మర్చిపోయాడా? రామకృష్ణతో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్ట మీదకు ఎందుకు వెళ్ళింది? వాళ్ళిద్దరి మధ్య పరిచయం, ఆ కథ ఏమిటి? లక్ష్మి తండ్రి, ఎమ్మెల్యే రఘుపతి (రఘు కుంచె), వీరన్న (అమిత్ తివారి) ఏం చేశారు? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Vikatakavi Web Series Review Telugu): థ్రిల్లర్ వెబ్ సిరీస్ లేదా సినిమాల్లో దర్శక రచయితలు పాటించే సూత్రం చివరి వరకు సస్పెన్స్ మైంటైన్ చేయడం! ఈ క్రమంలో ఒక్కోసారి అనవసరమైన క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్లపై అనుమానం కలిగే సన్నివేశాలు రూపొందించడం సహజమే. అటువంటి సన్నివేశాలు లేకుండా 'వికటకవి'ని రూపొందించిన దర్శక రచయితలు ప్రదీప్ మద్దాలి - తేజ దేశ్‌రాజ్‌లను మెచ్చుకోవాలి.
'వికటకవి' ప్రారంభంలో హైదరాబాద్ పోలీస్ స్టేషన్ సన్నివేశంలో వచ్చే ఓ క్యారెక్టర్ కొన్ని మలుపుల తర్వాత కీలక పాత్ర పోషిస్తుంది. కల్లు దుకాణంలో గ్యాంబ్లింగ్ ఆడే ఓ క్యారెక్టర్ కథను ఊహించని మలుపునకు తీసుకు వెళుతుంది. సాధారణ టీచర్ క్యారెక్టర్ హీరోకి ఓ దారి చూపించడంలో సాయపడుతుంది. కథలోని ప్రతి పాత్రకు ఒక పర్పస్ క్రియేట్ చేశారు. ఒక క్యారెక్టర్ ఆర్క్ డిజైన్ చేశారు. ఆ విషయంలో రచయిత తేజ దేశ్‌రాజ్ మంచి మార్కులు స్కోర్ చేశారు. ఒక థ్రిల్లింగ్ సిరీస్‌కు కావాల్సిన సెటప్ క్రియేట్ చేయడమే కాదు... మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే ఇచ్చారు. సింపుల్‌గా స్టార్ట్ చేసిన కథను దేశ భక్తికి, పాక్ తీవ్రవాదానికి ముడి పెడుతూ తీసుకెళ్లి సిరీస్ స్పాన్ పెంచారు. ప్రశాంత్ వర్మ 'కల్కి'కి తేజ దేశ్‌రాజ్ కథ అందించారు. దాని తర్వాత ఆయనకు మరో హిట్ అని చెప్పవచ్చు.
ఆడియన్స్‌కు థ్రిల్ ఇవ్వడం కోసం మిస్ లీడ్ చేయకున్నా... కథపై హింట్స్, నెక్స్ట్ ట్విస్ట్ లీడ్స్ వంటివి చేయరు. కానీ, ఈ సిరీస్‌లో అలా చేయలేదు. గుడి దగ్గర కోనేటిలో నుంచి హీరో పైకి వచ్చేటప్పుడు మతిస్థిమితం లేని వ్యక్తి ఓ మాట చెప్పడం, తనకు వాసన రాదని హీరో అనడం వంటివి జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ట్విస్టులు ఈజీగా తెలుస్తాయి. అయితే, ఆయా సన్నివేశాల్లో దర్శకుడు ప్రదీప్ మద్దాలి టాలెంట్ చూపించారు. హింట్స్ ఇస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా సిరీస్ తీశారు. షేక్ హ్యాండ్ కోసం హీరో పడే తపనను ఎగ్జిక్యూట్ చేసే విధానం బావుంది. చిన్న చిన్న విషయాల్లో డీటెయిలింగ్ క్యూరియాసిటీ బిల్డ్ చేయడంలో హెల్ప్ అయ్యింది.
ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో కన్విక్షన్, కమాండ్ కనిపించాయి. కథ నుండి డీవియేట్ అవ్వలేదు. టెక్నికల్ టీమ్ నుంచి మంచి అవుట్ పుట్ తీసుకోవడమే కాదు... సిరీస్‌ను క్రిస్పీగా తీశారు. హీరో హీరోయిన్లు పరిచయం అయ్యే సన్నివేశం సింపులే. కానీ, క్యూట్‌గా ఉంటుంది. హీరో ఫస్ట్ టైమ్ అడవిలోకి వెళ్లినప్పుడు వచ్చే సీన్, జీప్‌లో ఫైట్ వంటివి పెద్ద సినిమాలకు తీసిపోని రీతిలో చేశారు. 'వికటకవి'కి గ్రాండ్ లుక్ వచ్చేలా చేశారు.
Also Read: దేవకీ నందన వాసుదేవ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలు ఏంటి?
'వికటకవి'కి బిగ్గెస్ట్ ప్లస్ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్. 1970లలో కథ మొదలై, మధ్యలో 1940కు వెళ్లి మళ్లీ 70కు వస్తుంది. ఈ నేపథ్యం వల్ల 'వికటకవి' కొత్తగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో మంచి వర్క్ చేశారు. అయితే... బడ్జెట్ పరిమితులు పలు సన్నివేశాల్లో కనిపించాయి. ఎలక్ట్రిక్ షాక్, ఫ్లైట్ టేకాఫ్, దేవతల గుట్ట మీద వర్షం వంటివి బడ్జెట్ ఉంటే బాగా వచ్చేవి. కెమెరా వర్క్ బావుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం కథతో పాటు సాగింది. నెమ్మదిగా కథలో లీనం చేస్తుంది.
నరేష్ అగస్త్య డ్రసింగ్ నుంచి యాక్టింగ్ వరకు సింపుల్ కామన్ మ్యాన్‌ను రిప్రజెంట్ చేసేలా, డిటెక్టివ్ అనిపించేలా ఉన్నాయి. లుక్స్ అండ్ డైలాగ్ డెలివరీ అతనికి ప్లస్. మరోసారి మంచి నటనతో ఆకట్టుకున్నారు. మేఘా ఆకాష్ పాత్రకు తగ్గట్టు చేశారు. రఘు కుంచె, షిజు అబ్దుల్ రషీద్, ముక్తార్ ఖాన్, అశోక్ కుమార్, అమిత్ తివారిలవి రెగ్యులర్ రోల్స్ అయినా కథలో సెట్ అయ్యాయి. తారక్ పొన్నప్ప చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు.
వికటకవి... సింపుల్‌గా సాగే ఎగ్జైటింగ్ థ్రిల్లర్ సిరీస్. స్లో పాయిజన్‌లా ఎక్కేస్తుంది. ఆ పీరియాడిక్ సెటప్, నరేష్ అగస్త్య నటన, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం నచ్చుతాయి. లాజిక్స్ ఆలోచించకుండా మేజిక్ ఎంజాయ్ చేయడం మొదలు పెడితే... ఒక్కసారి స్టార్ట్ చేస్తే చివరి వరకు చూసేస్తారు. 'వికటకవి'కి మరో బిగ్గెస్ట్ ప్లస్ రన్ టైమ్. ఇందులో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి అటు ఇటుగా 35 నిమిషాలు... అంతే!