MMTS Train Incident: ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల రక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
Women Safety In MMTS Trains | ఇటీవల హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం జరగడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకుంది.

Panic mode buttons in MMTS Trains | హైదరాబాద్: మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ మోడ్ బటన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. పానిక్ బటన్ ప్రెస్ చేయగానే క్షణాల వ్యవధిలో రైల్వే పోలీస్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. RPF తో ఎల్లప్పుడూ నిఘా ఉంటుందని చెబుతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆరా తీశారు.
ఇటీవల హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైలులోనే మహిళపై అత్యాచారయత్నం జరగడం కలకలం రేపింది. దాంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్లు, ప్రైవేట్ ప్రాంతాలతో పాటు పబ్లిక్ స్థలాల్లోనూ బాలికలు, మహిళలకు రక్షణ కరువైందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక రైల్వే పోలీస్ అధికారి పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. ఇకపై రైళ్లలో ఒక పోలీస్ తో బందోబస్తు ఉంటుందని, మహిళలకు మరింత భద్రత కల్పిస్తామని అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం
ఈ ఘటన తెలంగాణ మొత్తాన్ని షేక్ చేసింది. కదులుతున్న రైలు నుంచి యువతి భయాందోళనతో కిందకి దూకేసిందంటే మహిళలకు రక్షణపై సందేహాలు నెలకొన్నాయి. శనివారం (మార్చి 22న) సాయంత్రం ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు ఓ యువతి మేడ్చల్ నుంచి ఎంఎంటీఎస్ రైలులో సికింద్రాబాద్ కు వెళ్లింది. పని పూర్తి చేసుకుని రాత్రి 8 గంటలకు తిరిగి ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. అల్వాల్ స్టేషన్లో కంపార్ట్ మెంట్లో ఉన్న ఇద్దరు మహిళలు దిగిపోయారు. యువతి ఒంటరిగా ఉందని గమనించి నిందితుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆమెను అసభ్యకరంగా తాకుతూ తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు. ఆందోళనకు గురైన యువతి అతడ్ని ప్రతిఘటించి కదులుతున్న రైలు నుంచి దూకేసింది. ఆమెను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వంగా 108లో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలించడంతో మంగళవారం ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు గంజాయికి బానిసైన పాత నేరస్తుడు అని పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లికి చెందిన జంగం మహేశ్ యువతిని వేధించాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి ఫొటోను చూపించగా.. యువతి సరిగ్గా గుర్తించలేదని సమాచారం. మరోవైపు నిందితుడ మహేశ్‌కు వివాహం కాగా, కొన్ని నెలల కిందట భార్య అతడ్ని వదిలేసింది. తల్లిదండ్రులు సైతం చనిపోవడంతో మహేశ్ ఒంటరయ్యాడు. గంజాయి సేవించడం లాంటి చెడు వ్యసనాలకు బానిస అయ్యాడని పోలీసులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

