Food Eating: ఆహారాన్ని వేగంగా తింటున్నారా? అంతే వేగంగా బరువు పెరిగిపోతారు జాగ్రత్త
ఆహారం వేగంగా తినే వాళ్ళు త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
ప్రపంచంలో పెరిగిపోతున్న ఆరోగ్య సమస్యలలో ఊబకాయం ఒకటి. దీని కారణంగానే అనేక అనారోగ్యాలు మనిషి పై దాడి చేస్తున్నాయి. అధిక బరువు, ఊబకాయం... ఈ రెండు ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు కారకాలుగా ఉన్నాయి. బరువు పెరగవద్దని ఇప్పటికే వైద్యులు పోషకాహారాన్ని సూచిస్తూనే ఉన్నారు. బరువు పెరగడం అనేది జన్యుపరంగా కూడా ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా ఊబకాయంతో బాధపడితే వారి వారసులకు కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల కూడా అధిక బరువు బారిన పడే అవకాశం ఉంది. జంక్ ఫుడ్ అధికంగా తినడం, వేళా పాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఆహారాలను తినడం, వ్యాయామం చేయకపోవడం వంటివి కూడా బరువు పెరిగేందుకు సహకరిస్తాయి.
అలాగే ఆహారాన్ని అతివేగంగా తినేవారు కూడా త్వరగా బరువు పెరిగిపోతారని చెబుతోంది ఒక అధ్యయనం. ఇలా వేగంగా తినడం వల్ల ఎంత తింటున్నారో కూడా తెలియకుండా ఎక్కువ తినే అవకాశం ఉంది. ఇలా మూడు పూటలా వేగంగా తింటే అవసరమైన దానికన్నా ఎక్కువ ఆహారం శరీరంలో చేరుతుంది. అది కొవ్వు రూపంలో పేరుకుపోయి బరువు పెరగడానికి కారణం అవుతుంది. మనం ఆహారాన్ని తింటున్నప్పుడు ఆహారం మనకు సరిపోయిందో లేదో తెలుసుకోవడానికి మెదడుకు కొంత సమయం పడుతుంది. కానీ మనం అతి వేగంగా ఆహారాన్ని తిన్నప్పుడు మెదడు పొట్ట నిండిన భావనను గుర్తించలేదు. దీనివల్ల ఇంకా అధికంగా తినేసే అవకాశం ఉంది కాబట్టి నెమ్మదిగా నవ్వుతూ ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.
ఒక అధ్యయనంలో 60 శాతం మంది పిల్లలు వేగంగా తింటున్నారని, వారిలో మోతాదుకు మించి తినే వారి సంఖ్య అధికంగా ఉందని తెలిసింది. ఇలా వేగంగా తినేవారిలో బరువు పెరిగే అవకాశం మూడు రెట్లు అధికంగా ఉన్నట్టు వివరిస్తుంది అధ్యయనం. ఈ పిల్లలు పెరిగే కొద్దీ ఊబకాయం బారిన పడే ప్రమాదం కూడా పెరుగుతుంది. వేగంగా తినడానికి ఇన్సులిన్ నిరోధకతకు మధ్య సంబంధం ఉన్నట్టు చెబుతోంది అధ్యయనం. వేగంగా తినేవారిలో మధుమేహం వచ్చే అవకాశం రెండున్నర రెట్లు అధికంగా ఉంటుంది. అంతేకాదు జీర్ణక్రియ సమస్యలు కూడా వీరికి వచ్చే ఛాన్సులు ఎక్కువ. ఇలా జీర్ణక్రియ సమస్యలు వస్తే మధుమేహం, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంటుంది. జీర్ణ క్రియ కూడా సవ్యంగా జరగదు. కాబట్టి భోజనం చేసేటప్పుడు నిదానంగా తినడం చాలా అవసరం.
Also read: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే రోజూ కొత్తిమీర తినండి
Also read: అక్షరాలు దిద్దించిన మీ తొలి గురువును ఓసారి తలుచుకోండి, వారే మీ ఉన్నతికి పునాది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.