KTR News: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్, త్వరలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
Telangana News | బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భావిస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు.

BRS Silver Jubilee Celebrations | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ అనంతరం బీఆర్ఎస్ పార్టీగా మారింది. రాష్ట్ర ప్రజలు రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి విజయాన్ని అందించారు. గత ఎన్నికల్లో ఓటమి చెందినా ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ క్రమంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.
అన్ని జిల్లాల్లో ముఖ్యనేతలు, కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం
ఈ పర్యటనల్లో భాగంగా కేటీఆర్ అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అందులో భాగంగా వరంగల్‌లో లక్షలాదిమంది పాల్గొన్న భారీ బహిరంగ సభ (Warangal Meeting)ను విజయవంతంగా నిర్వహించనునట్లు పార్టీ ప్రకటించింది.
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలను నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వేటిని అమలు చేయకుండా వంచిస్తున్న తీరు పైన కూడా చేపట్టాల్సిన కార్యాచరణ పైన కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్వయంగా జిల్లా నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల ప్రగతి హైలైట్ అయ్యేలా..
ఈ క్రమంలో మార్చి 20వ తేదీన సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, మార్చి 23న కరీంనగర్ జిల్లా నాయకులతో కేటీఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. 14 ఏళ్ల ఉద్యమం ప్రస్థానంతోపాటు, పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనువేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తుచేసుకోనున్నారు.
బీఆర్ఎస్ శ్రేణులకు మంచి భవిష్యత్
పార్టీకి ఎన్నిరకాల ఒడిదుడుకులు ఎదురైనా బీఆర్ఎస్ జెండాను గుండెల్లో పెట్టుకున్న పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేయనున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. తెలంగాణ ప్రజల భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పైన, కేసిఆర్ పైనే ఉందని.. రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. కేటీఆర్ పర్యటనలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వస్తుందని నేతలు చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

