Teachers day 2023: అక్షరాలు దిద్దించిన మీ తొలి గురువును ఓసారి తలుచుకోండి, వారే మీ ఉన్నతికి పునాది
ఈరోజు టీచర్స్ డే. ఈ సందర్భంగా మీకు విద్య నేర్పిన గురువులను ఒకసారి గుర్తుకు చేసుకోండి.
తల్లిదండ్రుల తర్వాత అత్యంత పూజనీయ స్థానంలో ఉన్న వ్యక్తి గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ఆచార్యదేవోభవ అంటారు. వారు చేయి పట్టి అక్షరాలు దిద్దించకపోతే ఈరోజు అద్భుతాలు సృష్టించే శాస్త్రవేత్తలు, వైద్యులు, లాయర్లు తయారయ్యే వాళ్ళే కాదు. అందుకే తల్లిదండ్రులతో సమానమైన స్థానాన్ని గురువుకి ఇవ్వాలని అంటారు పెద్దలు. ఉపాధ్యాయులు లేకుండా ఏ విద్యార్థి ఉన్నత స్థానానికి చేరుకోలేడు. అతనిలో జ్ఞానం అనేది దీపాన్ని వెలిగించేది ఉపాధ్యాయుడే. అందుకే దారి చూపే జ్ఞాన దేవతగా టీచర్లను చెప్పుకోవచ్చు. ఒక విద్యార్థిని ఉన్నత స్థానానికి తీసుకొచ్చేందుకు ఎలాంటి కల్మషం, స్వార్థం లేకుండా కష్టపడే వ్యక్తి టీచర్. మనలోని మొదటి శక్తిని గుర్తించేది, దానికి సానబెట్టేది గురువే. అందమైన భవిష్యత్తు దిశగా నడిపించేది వీరే. అందుకే గురువును ఒక నిచ్చెనతో పోల్చవచ్చు. మనదేశంలో టీచర్స్ డే వెనుక ఒక వ్యక్తి కష్టం దాగుంది. అతడి కష్టానికి గుర్తింపుగానే టీచర్స్ డే ను ఆయన పుట్టినరోజున నిర్వహించుకుంటాము. అతనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలుగు వ్యక్తే. అతని తల్లిదండ్రులు తెలుగు వారే. బతుకును వెతుక్కుంటూ ఈ తెలుగు దంపతులు తమిళనాడులోని తిరుత్తణికి వలస వెళ్లిపోయారు. అందుకే రాధాకృష్ణయ్య తమిళనాడులో రాధాకృష్ణన్ గా మారిపోయారు. వీరిది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామం. 1888 సెప్టెంబర్ 5న తిరుత్తణిలోనే జన్మించారు. రాధాకృష్ణన్ చిన్నప్పటి నుంచి అపారమైన తెలివితేటలను కలిగి ఉన్నారు. ఆ తెలివితేటల వల్ల చదువు కూడా స్కాలర్‌షిప్‌లతోనే అతని విద్యాభ్యాసం పూర్తయింది. పదహారేళ్ళకే మద్రాస్‌లోని క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అక్కడ పట్టభద్రుడు అయ్యాక అదే కళాశాలలో మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. 20 ఏళ్ల వయసులోనే బ్యాచిలర్ డిగ్రీ థీసిస్ పూర్తిచేశాడు. వేదాంత వ్యవస్థలో నైతికతకు చోటు లేదని చెప్పే అంశంపై ఆయన ఈ థీసిస్ రాశారు. రాధాకృష్ణన్ కు 20 ఏళ్ల వయసులోనే ఆ థీసిస్ ప్రచురణ కూడా అయింది. రాధాకృష్ణన్ మద్రాస్ ప్రెసిడెంట్ కాలేజీలో ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత మైసూరు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరారు. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలోని తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ గా చేరారు. ఇతని ఖ్యాతి అప్పటికే దశదిశలా వ్యాపించడం మొదలైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సుకు ప్రాతినిధ్యం వహించారు. ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచి వారిని చదువు వైపు నడిపించారు .
రాధాకృష్ణన్ కి పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడు 10 ఏళ్ల శివకామమ్మతో వివాహం జరిగింది. వీరికి ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అతని కుటుంబ సభ్యులు, కొడుకులు, కూతుళ్లు, మనుమలు, మనవరాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వృత్తులను అభ్యసించారు.
వైజాగ్ లో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్‌లర్‌గా కూడా పనిచేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ మనదేశంలోని పెద్ద విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేసిన వ్యక్తి. తర్వాత రష్యాకు భారత రాయబారిగా వెళ్లారు. భారతరత్న బిరుదును కూడా పొందారు. మన దేశ రెండవ భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం మొదలైంది. 1962 నుండి మనదేశంలో ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించుకుంటున్నారు.
Also read: తీపి పదార్థాలు తినే వారి కన్నా, కారం తినే వారే ఎక్కువ కాలం జీవిస్తారు