Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Allu Arjun Pushpa 2 Movie | సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ మృతి, ఆమె కుమారుడు కోమాలోకి వెళ్లడంపై అక్బరుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు.
Sandhya Theatre Stampede Incident at Allu Arjun Pushpa 2 premier show | హైదరాబాద్: ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన సమావేశాలకు కూడా వేలాది, లక్షలాది ప్రజలు తరలి వచ్చారని కానీ వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ ఇలా తోసివేయలేదన్నారు. కానీ ఇందుకు కారణమైన నటుడు మాత్రం తనకు విషయం తెలిసినా బాధితులకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు, వారి ప్రాణం పోయినందుకు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘తన సినిమా ప్రీమియర్ షో చూసేందుకు ఓ స్టార్ హీరో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ కు వచ్చారు. ఆ సమయంలో భారీగా జనం పోగయ్యారు. ఈ క్రమంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయారు. మరో ఇద్దరు స్పృహ కోల్పోయి పడిపోతే నటుడు మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. ఇది సరైన పద్ధతా, ఇది సమాజానికి ఏ సందేశం ఇస్తుంది. ప్రభుత్వం దీనిపై ఏ సమాధానం చెబుతుందని’ ప్రశ్నించారు.
సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం.. రేవంత్ రెడ్డి
థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు కోర్టులో ఉంది. డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ఉందని సంధ్య థియేటర్ యాజమాన్యం రెండో తేదీన చిక్కడపల్లి పోలీసులకు లేఖ రాసింది. సంధ్య థియేటర్ చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఉన్నాయని, ఒకవేళ సినిమా హీరో, హీరోయిన్లు వస్తే భారీగా జనాలు వస్తారు. కనుక సినిమా నటీనటులు లేకుండా చూసుకోవాలని మూడో తేదీన చిక్కడపల్లి సీఐ
రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఆరోజు జరిగిన తప్పిదాలు ఇవే
మొదట చేసిన తప్పు ఏంటంటే.. థియేటర్ వాళ్లు అడిగిన దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రోడ్ షో గురించి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం మరో తప్పిదం. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 8 నుంచి 10 థియేటర్లు ఉన్నాయి. అలాంటి చోట సినిమా స్టార్లు వస్తే సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినా రోడ్ షో చేశారు. కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి నటుడు ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ వచ్చారు. ఒక్కసారిగా వేలాది మంది అక్కడికి దూసుకొచ్చారు. యాభై, అరవై మంది సెక్యూరిటీ సిబ్బంది అభిమానులకు తోసుకుంటూ నటుడ్ని థియేటర్లోకి తీసుకెళ్లారు. టికెట్లు ఉన్నవారితో పాటు టికెట్ తీసుకోని వాళ్లు కూడా హీరోను చూసేందుకు థియేటర్లోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో ఆ కుటుంబం విడిపోయింది. రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఊపిరాడక స్పృహ కోల్పోయారు. తన ప్రాణాలు పోతున్నా కుమారుడ్ని కాపాడుకునేందుకు ఆ తల్లి యత్నించారు. ప్రాణాలు పోయినా కుమారుడి చేతిని ఆమె వదలలేదు. తరువాత వీరిని బయటకు తీసుకొచ్చి సీపీఆర్ చేసి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. కానీ మహిళ అప్పటికే మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ బ్రెయిడ్ డెడ్ అయి కోమాలోకి వెళ్లాడు.
విషయం తెలిసినా రూఫ్ టాప్ నుంచి నటుడు అభివాదం
ఆరోజు జరిగిన ఘటనను మాటల్లో వర్ణించలేం. ఘటన జరిగినట్లు తెలిసినా నటుడు థియేటర్ నుంచి వెళ్లిపోలేదు. శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని ఏసీపీ చెప్పినా హీరో పట్టించుకోలేదు. చివరకు డీసీపీ వచ్చి ఇప్పుడు మీరు థియేటర్ నుంచి వెళ్లిపోకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని నటుడ్ని హెచ్చరించారు. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా రూఫ్ టాప్ నుంచి ఫ్యాన్స్‌కు చేతులు ఊపుతూ వెల్లిపోయారు. ప్రపంచంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తోంది. ఓ తల్లి చనిపోయింది, ఆమె కొడుకు హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య ఉంటే వెళ్లి కనీసం పరామర్శించలేదు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూశారు. దీనిపై అక్బరుద్దీన్ చెప్పింది నిజమే’ అని రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై సంచలన విషయాలు వెల్లడించారు.
Also Read: ED Case On KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ