ED Case On KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ
Telangana News: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి ఈడీ రంగంలోకి దిగింది. కేటీఆర్ సహా అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
ED Case On KTR In E Formula Car Race Issue: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో (Formula E Car Race) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి రంగంలోకి దిగిన ఈడీ (Enforcement Directorate).. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కేసు ఫైల్ చేసింది.
హైకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట
అటు, ఈ వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు పూర్తైనందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకరరావు, గండ్ర మోహన్‌రావు వాదించారు. ఏసీబీ పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని.. ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరారు. 'ఈ కేసుకు ముఖ్యంగా 13(1)(a), 409 సెక్షన్లు వర్తించవు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదనడం సరికాదు.
14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ లేకుండా కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబర్ 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కు తగ్గారు. రేస్ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది. ప్రజా ప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలి. ఈ నెల 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్లు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు.' అని పేర్కొన్నారు.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 30వ తేదీ వరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. అయితే, ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
అసలేంటీ ఈ ఫార్ములా కేసు
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై విచారించేందుకు ఏసీబీకి అనుమతి ఇచ్చింది. ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.55 కోట్లు తరలించినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోకుండా విదేశీ కంపెనీకి తరలించారని పేర్కొంటున్నారు. విదేశీ కంపెనీకి భారతీయ కరెన్సీ చెల్లించడంపైనా ఆర్బీఐ రూ.8 కోట్ల ఫైన్ వేసిందని వెల్లడించారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి అక్టోబరులోనే ఏసీబీ గవర్నర్‌కు అనుమతి కోసం పంపింది. న్యాయసలహా తీసుకున్న అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఇటీవల అనుమతి ఇచ్చారు. దీంతో కేటీఆర్‌పై కేసు నమోదైంది.