CM Revanth Reddy: 'ఈ కార్ రేస్‌పై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం' - బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లైనా చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్
Telangana News: తెలంగాణ అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
CM Revanth Reddy Reacts On E Forumla Car Race Issue: తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Car Race) వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సంచలనం రేకెత్తిస్తోంది. గత 2 రోజులుగా ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా, తెలంగాణ అసెంబ్లీలో ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఈ వ్యవహారంలో చర్చించేందుకు రావాలన్న కేటీఆర్ సవాల్‌పై స్పందించారు. ఈ కార్ రేస్‌పై సభలో చర్చించాలని కేటీఆర్ ఇంతకాలం ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. 'ఈ కార్ రేస్ ప్రతినిధులు వచ్చి నన్ను కలిశారు. రూ.600 కోట్లు పెండింగ్ నిధులు రావాల్సి ఉంది. ఇవ్వమని అడిగారు. మీరు ఊ.. అంటే మరోసారి రేసింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఎఫ్ఈవో ప్రతినిధులు వచ్చి కలిసిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.' అని రేవంత్ వెల్లడించారు.
'బీఆర్ఎస్ కార్యాలయంలోనైనా చర్చిస్తాం'
'హెచ్ఎండీఏ ఖాతాలోని రూ.కోట్ల నిధులు లండన్‌లోని కంపెనీకి నేరుగా ఎలా వెళ్తాయి.?. నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ రూ.600 కోట్లు. మిగతా డబ్బు కోసం వాళ్లు వచ్చినప్పుడే ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఓఆర్ఆర్ అమ్మినా.. హెచ్ఎండీఏ నిధులు కాజేసినా.. అడగవద్దన్నట్లు మాట్లాడుతున్నారు. నేను జాగ్రత్త పడడం వల్ల రూ.450 కోట్లు మిగిలాయి. ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై ఏసీబీ విచారణ సాగుతోంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సాగుతోంది కాబట్టి ఎక్కువ వివరాలు వెల్లడించలేను. న్యాయపరంగా చిక్కులు లేకుంటే ఈ వ్యవహారంపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం. అవసరమైతే బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లైనా చర్చిస్తాం. రూ.55 కోట్లు చిన్న విషయం కాదు.' అని రేవంత్ పేర్కొన్నారు.
కాగా, ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలన కలిగిస్తోంది. దీనికి సంబంధించి కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. అసలది కేసే కాదని.. ఇది ఓ చిల్లర కేసని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఫార్ములా వన్ ఈ కార్ రేస్ వ్యవహారంపై సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అయినా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. 'హైదరాబాద్‌ను ఇన్నోవేషన్, రీసెర్చ్, మ్యానుఫాక్చరింగ్ హబ్ కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్ రేస్ నిర్వహించాం. తాము తొలుత ఫార్ములా - 1తో సంప్రదిస్తే వారు రామన్నారు. ఎన్నో తంటాలు పడి ఒప్పించాం. 2023లో ఫిబ్రవరిలో మేము నిర్వహించిన రేస్ చూసి కేంద్ర మంత్రులు, బడా పారిశ్రామిక వేత్తలు సైతం మెచ్చుకున్నారు. రేవంత్ సర్కార్ కుంభకోణం, లంబకోణం అని కేబినెట్‌లో ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారు.' అని మండిపడ్డారు. మరోవైపు, శుక్రవారం అసెంబ్లీలో ఈ వ్యవహారంపై తీవ్ర గందరగోళం నెలకొంది. భూభారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ నేతలు అడ్డుకోగా.. మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభ పలుమార్లు వాయిదా పడింది.