Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Travis Head: ఆసీస్ బ్యాటర్ హెడ్.. ఈ సీరిస్ లో భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు టెస్టుల్లో 82 సగటుతో, 94 స్ట్రైక్ రేటుతో 409 పరుగులు చేసి, సిరీస్ లీడింగ్ స్కోరర్ నిలిచాడు.
BGT Series: ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ కు అస్సలు మింగుడు పడని బ్యాటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ట్రావిస్ హెడ్ మాత్రమే. భారత్ అంటే చాలు రెచ్చిపోయి ఆడే ఆటగాళ్లలో తను ముందు వరుసలో ఉంటాడు. నిజానికి గత కొన్నేళ్లుగా తన కారణంగానే మేజర్ టోర్నీ టైటిళ్లు భారత్ కు దూరమయ్యాయి. 2023 ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో సెంచరీ, అదే ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ, ప్రస్తుత సిరీస్ లో ఆల్రెడీ రెండు సెంచరీలు, ఒక అర్థ సెంచరీతో తను సూపర్ ఫామ్ ను ప్రదర్శిస్తున్నాడు. నిజానికి ఈ సిరీస్ లో తను లీడింగ్ స్కోరర్ గా నిలిచాడు. తాజాగా హెడ్ పై భారత మాజీ కోచ్ రవి శాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు.
భారత్ కు కొత్త హెడేక్..
నిజానికి ట్రావిస్ సర్ నేమ్ అయిన హెడ్ ను శాస్త్రి చమత్కారంగా ఉపయోగించాడు. అతడు ఇండియాకు హెడేక్ గా మారుతున్నాడని ప్రశంసించాడు. గత మూడేళ్ల కిందటికి, ఇప్పటికీ అతని ఆటతీరులో చాలా మార్పు వచ్చిందని, ముఖ్యంగా షార్ట్ బాల్ బలహీనతను బాగా అధిగమించాడని పేర్కొన్నాడు. బంతి తన జోన్ లోకి వస్తేనే ఫుల్ షాట్ ఆడుతున్నాడని, లేకపోతే వదిలేస్తున్నాడని ప్రశంసించాడు. ఇక కంగారూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్న బుమ్రాను హెడ్ మాత్రం అలవోకగా ఎదుర్కొన్నాడని శాస్త్రి విశ్లేషించాడు. సిరీస్ లోని ఒక మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ ఫ్రంట్ ఫూట్ తో అద్భుతమైన కవర్ డ్రైవ్ ను కొట్టాడని, అతడిలోని ప్రైమ్ ఫామ్ ను ఇది చాటుతోందని ప్రశంసించాడు.
దూకుడు మంత్రమే..
భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటు దూకుడుగా ఆడుతున్నాడని హెడ్ ను శాస్త్రి ప్రశంసించాడు. మరోవైపు సిరీస్ లో హెడ్ హవా కొనసాగుతోంది. పెర్త్ లో జరిగిన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులతో విఫలమైన హెడ్, తర్వాతి ఇన్నింగ్స్ నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండో ఇన్నింగ్స్ లో 89 పరుగులు చేసిన హెడ్.. రెండో టెస్టులో 140 పరుగులతో సత్తా చాటాడు. ఇక బ్రిస్బేన్ టెస్టులో 152 రన్స్ తో విశ్వ రూపం ప్రదర్శించాడు. ఇక తను వన్డే తరహాలో బంతికో పరుగు చొప్పున సాధిస్తూ భారత బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాడు.
ఇప్పటికే బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (బీజీటీ సిరీస్) లో 409 పరుగులు సాధించి టాప్ స్కోరర్ గా నిలిచిన హెడ్.. రెండోస్థానంలో ఉన్న రాహుల్ (235 పరుగులు)కి అందనంత దూరంలో ఉన్నాడు. ఇది చాలు తను ఆధిపత్యం ఎలా ప్రదర్శిస్తున్నాడో చెప్పడానికి విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు హెడ్ ను అడ్డుకోవడంలో టీమిండియా విఫలమైందని, అతని కోసం ప్రణాళికలు రచించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా లెఫ్టార్మ్ పేసర్ ఎదుర్కోవడంలో హెడ్ ఇబ్బంది పడుతాడని తెలిసి, జట్టులో అలాంటి వారిని ఎంపిక చేయక పోవడం కచ్చితంగా లోటేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read: Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు