Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Minister Narayana: అమరావతి విషయంలో జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. జగన్ మిడిమిడి జ్ఞానం పై విమర్శలు గుప్పించారు.

Minister Narayana counters Jagan comments on Amaravati: అమరావతి రాజధాని విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడింది. గురువారం మంత్రులు నారాయణ , పార్థసారథి వేర్వేరుగా మీడియా సమావేశాలు నిర్వహించి, జగన్ విమర్శలను తిప్పికొట్టారు. అమరావతిపై జగన్ కావాలనే విష ప్రచారం చేస్తున్నారని, గత ఐదేళ్ల పాలనలో రాజధానిని ధ్వంసం చేసిన వ్యక్తికి ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రులు మండిపడ్డారు.
రాజధానిని నదీ గర్భంలో కడుతున్నారన్న జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రివర్ బేసిన్ అంటే ఏమిటో జగన్ తెలుసుకోవాలి, నదీ గర్భంలో భవనాలు ఎక్కడ కడుతున్నామో చూపించాలి అని సవాల్ విసిరారు. జగన్ కేవలం మిడిమిడి జ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని, అమరావతిని నదిలో కాకుండా అన్ని రకాల పర్యావరణ అనుమతులతోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. మూడు ముక్కలాట ఆడి రాజధానిని అస్తవ్యస్తం చేసిన జగన్, ఇప్పుడు రెండో దశ భూసేకరణపై తప్పుడు మాటలు చెబుతున్నారని విమర్శించారు.
అమరావతికి గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వకుండా నిలిపివేసిందని, కానీ కూటమి ప్రభుత్వం రాగానే పునర్నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభించిందని మంత్రులు తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది అడ్డుపడినా అమరావతి నిర్మాణం ఆగిపోదు అని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి చట్టబద్ధత కల్పించేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని, రైతుల ఆమోదంతోనే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ సాగుతోందని వివరించారు.
జగన్ చేస్తున్న తప్పుడు ప్రచారాల వల్లే గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు వచ్చాయని మంత్రులు ఎద్దేవా చేశారు. ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఆ 11 స్థానాలు కూడా రావడం కష్టమని జోస్యం చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో అమరావతి స్వరూపాన్ని మార్చేందుకు జగన్ చేసిన ప్రయత్నాలను ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేశామన్న జగన్ వ్యాఖ్యలను కూడా మంత్రులు ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని, ప్రతి ప్రాజెక్టును పారదర్శకంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జగన్ ఎన్ని కుతంత్రాలు పన్నినా, రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా విరాజిల్లుతుందని వారు స్పష్టం చేశారు.
అమరావతిపై జగన్ ఏమన్నారంటే ?
అమరావతి విషయంలో జగన్ ప్రధానంగా ప్రభుత్వంపై మూడు ఆరోపణలు చేశారు. మొదటి దశలో భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, అక్కడ కనీస అభివృద్ధి పనులు చేయకుండానే ఇప్పుడు రెండో దశ పేరుతో మరో 50,000 ఎకరాల భూసేకరణకు పూనుకోవడం కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. రాజధానిని వరద ముంపు పొంచి ఉన్న నదీ గర్భంలో నిర్మించడం పర్యావరణపరంగా ప్రమాదకరమని, ఇది కేవలం చంద్రబాబు తన అనుకూల వర్గానికి లబ్ధి చేకూర్చడానికి చేస్తున్న భారీ కుంభకోణమని ఆయన ఆరోపించారు.





















