Snake In Meeting: కౌన్సిల్ సమావేశానికి నాగుపామును తెచ్చిన సభ్యుడు.. మంత్రి నియోజకవర్గంలో షాకింగ్ సీన్
Nidadavolu council meeting | నిడదవోలు కౌన్సిల్ సమావేశానికి ఓ సభ్యుడు బతికున్న నాగుపామును తీసుకురావడంతో సభలో మిగతా సభ్యులు బెంబేలెత్తిపోయారు.

కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు ఎవరైనా ముఖ్యమైన పేపర్స్ లాంటివి తెచ్చుకుంటారు. కానీ ఒక సభ్యుడు ఏకంగా నాగుపామును పట్టుకుని సమావేశానికి రావడంతో మిగిలిన మెంబర్లు హడలెత్తిపోయారు. ఏపీలో సంచలనంగా మారిన ఈ ఘటన టూరిజం మంత్రి కందుల దుర్గేష్ సొంత నియోజకవర్గంలో జరగడం విశేషం.
పాముల బాధ ఎక్కువైందని చెప్పడానికి నాగుపాము ని మీటింగ్ కి తీసుకొచ్చిన కౌన్సిలర్
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా 20 వార్డు కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ ఒక డబ్బాలో తాచు పాముని పెట్టి సమావేశానికి హాజరయ్యారు. ఆ డబ్బా ఉన్న సంచిని తన పక్కనే పెట్టుకుని కౌన్సిల్ సమావేశం లో కూర్చోవడం గమనించిన AE హేమంత్ అ సంచి ని బయటికి తీసుకుని వెళ్ళాలి అని సూచించినా అనిల్ వినలేదు. ఈ విషయం చైర్మన్ ఆది నారాయణ దృష్టికి రావడం తో ఆయన అసంచిని బయటపెట్టి రావాలని మందలించారు. అప్పుడు ఆ సంచిలో పాము ఉన్న విషయాన్ని గమనించి మిగిలిన సభ్యులు బెంబేలెత్తారు. బాబు ఉన్న డబ్బాను బయటపెట్టి తిరిగి కౌన్సిల్ మందిరం లోకి వచ్చిన అనిల్ తన వార్డులో పాముల బాధ ఎక్కువైపోయింది అని చెప్పడానికి ఈ పని చేసినట్టు తెలిపారు.
నిడదవోలులో పాములు బాధ ఎక్కువైపోయింది : కౌన్సిలర్ అనిల్
నిడదవోలు నియోజకవర్గంలోని తన వార్డు లో అభివృద్ధి పనులు సరిగ్గా జరగడం లేదని ఖాళీ స్థలాలు, స్కూల్ గ్రౌండ్స్ లో పిచ్చి మొక్కలు ఎక్కువైపోయి పాములు యాధేచ్చ గా తిరుగుతున్నాయని అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకుని వెళ్లినా వారు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే ఒక తాచుపాము రోడ్డు పైకి వచ్చేసింది అని ఒక బాలుడు చూసుకోకుండా దాని పక్క నుంచి వెళ్ళాడని ఆ పాము కాటేసి ఉంటే ఆ బాలుడు పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అందుకే ఆ తాచుపామును పట్టించి కౌన్సిల్ సమావేశానికి తీసుకొచ్చినట్టు అనిల్ తెలిపారు.
పామును సురక్షితంగా వదిలిపెట్టిన సిబ్బంది
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ సభ గౌరవాన్ని కాపాడాలని అనిల్ కు సూచించారు.పాముల సమస్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన చైర్మన్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది అనిల్ తీసుకొచ్చిన తాచుపాముని దూరంగా తీసుకెళ్లి వదిలేయడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.























