Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం
Andhra Pradesh News | ఏపీ డిప్యూటీ డీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలో రూ. 5.5 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Pawan Kalyan lays stone for roads in Alluri Sitarama Raju district | అనంతగిరి: 'అడవి బిడ్డలు ప్రకృతి పరిరక్షకులు.. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో గిరిజనుల సంరక్షణతోపాటు ఆదివాసీ ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన, ఉన్నచోటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాము. అందులో భాగంగా మొదటగా డోలీ రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా రోడ్ల నిర్మాణం చేపట్టామ'ని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అడవి బిడ్డలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
గత ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని వెల్లడించారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాన మంత్రి మోదీ ఆధ్వర్యంలో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలోని గుమ్మంతి, బల్లగరువు మధ్య రూ. 5.5 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం చేపట్టనున్న మార్గం ద్వారా సుమారు 3 కిలోమీటర్లు కొండపైకి వెళ్లి అక్కడ గిరిజనులతో మాట్లాడారు. అక్కడ పరిస్థితులపై పరిశీలన చేశారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ "పోరాట యాత్ర సమయంలో మన్యం గ్రామాల్లో తిరిగిన సమయంలో వారి సమస్యలు అర్ధం చేసుకున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? ఉన్న సమస్యలు ఏంటి? వాటి పరిష్కార మార్గాలు ఏమిటి అనే అంశంపై దృష్టి సారించాము. గిరిజన గ్రామాల్లో ప్రధానంగా రహదారి సౌకర్యం లేక అత్యవసర పరిస్థితుల్లో డోలీల్లో దిగడం, ఆరోగ్య పరిరక్షణకు సరైన సౌకర్యాలు లేకపోవడం వంటి అంశాలు బాధ కలిగించాయి. పనులు చేపట్టడానికి బడ్జెట్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. కోటీ, రెండు కోట్లు ఖర్చు చేయాలన్నా ఇబ్బందిపడే పరిస్థితి. పైగా ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చుతో అర్బన్ ప్రాంతంలో 5 వేల మందికి సౌకర్యాలు కల్పించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో గిరిపుత్రులు పడుతున్న ఇబ్బందులు చూసి ఇక్కడ రహదారులు నిర్మిస్తున్నాం. ఓట్ల కోసం మాత్రం కాదు.
కేంద్ర, రాష్ట్ర పథకాల సమ్మిళితంతో గిరిజనాభివృద్ధి
గతంలో గిరిజన గ్రామాల్లో పర్యటించి సమస్యలు అర్థం చేసుకున్నాను. ఈ ప్రాంతంలో రోడ్లతోపాటు ఆరోగ్య సౌకర్యాలు, తాగు నీరు ఏర్పాటు చేయాల్సి ఉంది. బడ్జెట్ పరమైన ఇబ్బందులు ఉన్నా మొదటి విడతగా ఏజెన్సీలో రూ.105. 33 కోట్ల మేర ఖర్చు చేసి రహదారుల నిర్మాణం చేపట్టాం. అందులో నరేగా నిధుల నుంచి రూ. 72.20 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 33.13 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా గుమ్మంతి, బల్లగరువు మధ్య రూ. 5.5 కోట్ల నిధులతో నిర్మించతలపెట్టిన రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జనాభా పల్చగా ఉంటారు. 420 పంచాయతీల్లో 2612 కుగ్రామాలు ఉన్నాయి. గతంలో ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఓట్ల పడవు అన్న ఉద్దేశంతో సౌకర్యాల కల్పనపై దృష్టి సారించలేదు. మా ప్రభుత్వం ఓట్ల కోసం పని చేయడం లేదు. చంద్రబాబు నాయకత్వంలో, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నాం.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అడిగిన వెటనే 24 గిరిజన గ్రామ పంచాయతీలను అనుసంధానించేందుకు ముఖ్యమంత్రి రూ. 49 కోట్ల నిధులు మంజూరు చేశారు. వీటితో పాటు ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వన్ ధన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు కొన్ని ఉన్నాయి. ఈ పథకాలను కొన్ని తెగలకు ప్రత్యేకంగా అమలు చేయవచ్చు. మనసున్న చోట మార్గం ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం ఉన్న అన్ని పథకాలను కలిపి ముందుకు తీసుకువెళ్తున్నాం. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ రహదారి ద్వారా వందల మంది గిరిజన జనాభాకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఓట్ల కోసం కాదు ప్రజల బాగు కోసం పని చేస్తుంది. మేము ఓట్ల కోసం కాదు ప్రజల కోసం పని చేయడానికే ఉన్నాము.
Also Read: Ram Gopal Varma: ఆర్జీవీకి గట్టి షాక్ ఇచ్చిన ఫైబర్ నెట్ - డబ్బులన్నీ వడ్డీతో సహా కట్టాలని నోటీసులు
పర్యాటక అభివృద్ధి ద్వారా గిరిజన గ్రామాల్లో ఉపాధి కల్పన
ఇక్కడ అటవీ ప్రాంతంలో ఒక్కో గూడెంలో 20 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. వారి అనుమతితో రెండు హోమ్ స్టేలు నిర్మిస్తే పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు. గ్రామానికి లబ్ది ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి నీటి సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలు మా దృష్టికి వచ్చాయి. అన్నింటికీ సమగ్రమైన పరిష్కార మార్గాలు వెతుకుతాం.
గత ప్రభుత్వం వచ్చే పదేళ్లలో ప్రజలు తాగే మద్యం మీద కూడా అప్పులు చేసింది. ఎయిడెడ్ స్కూళ్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. రుషికొండ ప్యాలెస్ కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం అరకొర పనులతో సరిపెట్టారు. నేను విమర్శలు చేయడం లేదు. మేము పడుతున్న కష్టం ప్రజలకు తెలియాలి.
ఓటు ఎవరికి వేసినా ప్రజలు బాగుండాలి
ప్రజలు ఏ ప్రభుత్వం వచ్చినా పనులు చేస్తుంది అనుకుంటారు. ఎవరికి ఓటు వేయాలన్నది వారే నిర్ణయించుకుంటారు. మొదటి నుంచి నా సిద్ధాంతం ఒకటే.. ప్రజలు ఓట్లు వేసినా వేయకున్నా వారి సమస్యలు తీర్చడం మా బాధ్యత అనుకుంటాను. ఈ ప్రాంతంలో ప్రజలు గత ప్రభుత్వాన్ని నమ్మి ఓటు వేశారు. ఐదేళ్లలో ఏమీ చేయకున్నా మళ్లీ ఆ పార్టీకే ఓటు వేశారు. వారు ఎవరికి ఓటు వేసినా ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడ పనులు చేపట్టాం. ఈ గ్రామాల్లో నీటి నిల్వ కోసం కొత్త మార్గాలు వెతకాలి, సరికొత్త సాంకేతికత సహకారంతో నీటిని ఒడిసి పట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ప్రాథమిక చికిత్స అందుబాటులో లేదు. గ్రామాలను అనుసంధానించే రోడ్లు లేవు. జానియర్ కాలేజీ లేదు. ఈ సమస్యలన్ని ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారు. అన్నింటికీ పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం.
కొన్ని గిరిజన ప్రాంతాల్లో గ్రామ దేవతలకు గంజాయి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తుంది. అందువల్ల ఈ ప్రాంతంలో గంజాయి సాధారణంగా దొరుకుతుంది. దాన్ని వాణిజ్యంగా మార్చి మాఫియాలుగా ఏర్పడటంతో శాంతి భద్రతల సమస్యలు వచ్చాయి. గంజాయి నిర్మూలన కోసం ఇక్కడ యువతలో అవగాహన కల్పించాలి. దీంతోపాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపడం ద్వారా గంజాయికి చెక్ పెట్టవచ్చు. ఆ దిశగా ప్రణాళికలు ముందుకు తీసుకువెళ్తామ'ని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, పాడేరు ఐటీడిఏ పీఓ వి.అభిషేక్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.