Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి ప్రకటన
Komatireddy Venkat Reddy: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. మంత్రి కోమటిరెడ్డి ఈ విషయం తెలిపారు.
Komatireddy Venkat Reddy Financial Assistance to Sri Tej Family | హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులకు ఈ మొత్తం ఖర్చు చేస్తామన్నారు. తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు లేవు అని అధికారికంగా చెప్పారు. రాష్ట్రంలో ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
కిమ్స్ హాస్పిటల్‌కు మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ అసెంబ్లీ నుంచి నేరుగా సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్‌కు బయలుదేరారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో అస్వస్థతకు గురై, విషమ పరిస్థితిలో ఉన్న శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు. రేవతి కుటుంబాన్ని మంత్రి కోమటిరెడ్డి పరామర్శించనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని మంత్రి ప్రకటించారు. తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద 25 లక్షల చెక్కును శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వనున్నట్లు కోమటిరెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కు వెళ్లి ఆర్థిక సాయం చెక్కును బాలుడి తండ్రికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
తొక్కిసలాటకు అల్లు అర్జున్ కారణం!
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి సంధ్య 70ఎంఎం వద్ద జరిగిన తొక్కిసలాటకు హీరో అల్లు అర్జున్ రావడమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓ హీరో తన సినిమా చూసేందుకు థియేటర్ కు రావడంతో ఓ మహిళ చనిపోగా, ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నాడని.. ఆ సమయంలోనూ నటుడు వాహనం రూఫ్ టాప్ నుంచి ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారని అక్బరుద్దీన్ ప్రశ్నించగా సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, బాధ్యులైన సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు హీరోపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్డు భారీగా జన సంచారం ఉండే ఏరియా అని.. థియేటర్ల వద్దకు హీరో హీరోయిన్లు రావొద్దని చిక్కడపల్లి సీఐ సంధ్య థియేటర్ వాళ్ల లేఖకు సమాధానం ఇచ్చారు. కానీ నిబంధనలు ఉల్లంఘించి నటుడు థియేటర్ కు రావడం ఆయన బౌన్సర్లు జనాలను నెట్టేయడం జరిగిందన్నారు. హీరోను చూసేందుకు వేలాదిగా ప్రజలు ఒక్కసారిగా రావడంతో జరిగిన తొక్కిసలాటలో తన ప్రాణాలు పోతున్నా కొడుకును రక్షించుకునేందకు రేవతి యత్నించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆమె చనిపోగా, ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా హీరో వెళ్లి కనీసం పరామర్శించలేదన్నారు. హీరో నిర్లక్ష్యం అలా ఉందని, కానీ తప్పు చేసిన వారిపై తాము చర్యలు తీసుకుంటే సినీ వర్గాలు ఆయనకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వాన్ని తిట్టాయన్నారు. కానీ వారిలో ఒకరైనా బాధిత కుటుంబాన్ని పరామర్శించారా, వారికి ఏమైనా సాయం చేశారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వ చర్యలకు ఎంఐఎం మద్దతు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పుష్ప 2 హీరోపై ప్రభుత్వం చర్యలకు ఎంఐఎం పార్టీ మద్దతు తెలిపింది. ప్రాణాలు పోతే ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటుందన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. మనిషి ప్రాణం పోయిందని చెప్పాక కూడా థియేటర్ బయటకు వచ్చి కారు రూఫ్ టాప్ నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిన వారిని ఏమనాలి అంటూ మండిపడ్డారు.