Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Andhra Pradesh Crime News | బాలికల్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠా ఆట కట్టించారు విశాఖ రైల్వే పోలీసులు. ఎక్స్‌ప్రెస్ రైల్లో తరలిస్తుండగా దాడులు చేసిన పోలీసులు 11 మంది బాలికలకు విముక్తి కలిగించారు.
Human Trafficking in Visakhapatnam railway station | విశాఖపట్నం: ఎన్నికల సమయంలో ఏపీలో సంచలనం రేపిన అంశాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటి. రాష్ట్రం నుంచి దాదాపు 30 వేల మంది అమ్మాయిలు, మహిళలు వైసీపీ ఐదేళ్ల పాలనలో అదృశ్యం అయ్యారని ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కేంద్రం నుంచి తనకు సమాచారం ఉందని, లెక్కలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు తెలిసిందే. తాజాగా విశాఖపట్నంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది.
ఎక్స్‌ప్రెస్ రైలులో బాలికల అక్రమ రవాణా
కిరండోల్- విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్స్‌ప్రెస్ రైలు దాదాపు 11 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో రైల్వే పోలీసులు ఒక్కసారిగా ఆకస్మిక దాడి చేశారు. తమిళనాడుకు బాలికల్ని అక్రమ రవాణా చేస్తున్న రవి బిసోయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కిడ్నాప్ అయి రవాణా అవుతున్న ఆ చిన్నారులు ఒరిస్సాలోని నవరంగ్ పూర్ ప్రాంతానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. విశాఖ రైల్వే పోలీసులు బాలికల్ని ఒడిషా పోలీసులకు అప్పగించనున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు హ్యుమన్ ట్రాఫికింగ్ కేసును ఒడిషా పోలీసులకు అప్పగించారు. ఆ గ్యాంగ్‌లో ఇంకా ఎంత మంది ఉన్నారు, బాలికల్ని రవాణా చేయడం ఇదే తొలిసారా, గతంలో ఇలాంటివి ఎక్కడ చేశారు అనే కోణాల్లో ఒడిషా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.