NEET PG 2024 Admitcard: నీట్ పీజీ-2024 అడ్మిట్ కార్డులు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
NEET PG 2024: నీట్ పీజీ-2024 ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించనుంది.
NEET PG Admit Card 2024 Out: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ (పీజీ)-2024 అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ఆగస్టు 8న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నీట్ పీజీ-2024 పరీక్షను ఆగస్టు 11న కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 185 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
NEET PG 2024 అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
➥ అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - nbe.edu.in
➥ అక్కడ హోమ్‌పేజీలో కనిపించే ‘NEET PG’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
➥ లాగిన్ పేజీలో అభ్యర్థలు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.
➥ వెంటనే స్క్రీన్ పై NEET PG Admit Card 2024 ఓపెన్ అవుతుంది.
➥ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.
నీట్ పీజీ పరీక్ష విధానం..
నీట్ పీజీ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పరీక్షలో మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.
'టైమ్-బౌండ్ సెక్షన్' విధానం అమలు..
నీట్ పీజీ పరీక్షలో టైమ్-బౌండ్ సెక్షన్ (Time Bound Sections) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. టైమ్ బౌండ్ సెక్షన్స్ విధానం అనేది కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షలో సెక్షన్ల వారీగా సమయం కేటాయించడం. దీనిప్రకారం క్వశ్చన్ పేపర్‌ను సెక్షన్ల వారీగా విభజించి.. ప్రతి సెక్షన్‌కు కొంత సమయం కేటాయిస్తారు. ఆ సెక్షన్‌ను ఇచ్చిన సమయంలో పూర్తిచేసిన తర్వాతనే తర్వాతి సెక్షన్ ఓపెన్ అవుతుంది. మల్టిపుల్‌ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహించే నీట్ పీజీతో పాటు NBEMS నిర్వహించే ఇతర పరీక్షల సమయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సెక్యూరిటీ, ప్రాముఖ్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
'టైమ్-బౌండ్ సెక్షన్' పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను జనరల్/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్, జనరల్(PwD) అభ్యర్థులకు 50 పర్సంటైల్, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (PwD కలిపి) అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా మొత్తం 185 నగరాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 34 నగరాలు/పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అమలాపురం, అమరావతి, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, కడప, కాకినాడ, కరీంనగర్, కావలి, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ, నంద్యాల, నెల్లూరు, నిజామాబాద్, ఒంగోలు, రాజంపేట, సత్తుపల్లి, సిద్ధిపేట, సూరంపాలెం, సూర్యాపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.