Hyderabad News: గాల్లో విమానం, వృద్ధుడికి తీవ్ర అస్వస్థత.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ ప్రీతిరెడ్డి
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. అదే ఫ్లైట్ లో జర్నీ చేస్తున్న డాక్టర్ ప్రీతిరెడ్డి సకాలంలో స్పందించి చికిత్స చేసి ఆయన ప్రాణాలు కాపాడారు.

Doctor Preethi Reddy | హైదరాబాద్: విమానంలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు అకస్వాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అసలే ఎవరు వెంట లేకుండా ఒంటరిగా విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ఆయన అదృష్టం కొద్దీ విమానంలో ఓ మహిళా డాక్టర్ ప్రయాణిస్తున్నారు. వెంటనే ఆమె చికిత్స చేసి 74 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలు కాపాడారు.
అసలేం జరిగిందంటే..
ఇండిగో విమానంలో ఓ వృద్ధుడు రెండు రోజుల కిందట ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తున్నాడు. విమానం గాల్లో ఉండగా వృద్ధుడు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. నోటి నుంచి ద్రవం కారడం, మూత్రం పోవడం, మగతగా అతడి పరిస్థితి మారింది. అసలే ఆయన ఒంటరిగా విమానంలో ప్రయాణిస్తున్నారు. అదే విమానంలో మల్లారెడ్డి విశ్వ విద్యాపీట్ జనరల్ ఫిజిషియన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి ఉండటంతో ఆమె స్పందించారు. వృద్ధుడికి సకాలంలో వైద్య చికిత్స చేశారు. బీపీ తక్కువగా ఉందని నిర్ధారించుకున్న వెంటనే డాక్టర్ ప్రీతిరెడ్డి ఆ వృద్ధుడికి సీపీఆర్ చేశారు. దాంతో కొన్ని నిమిషాల్లోనే బాధితుడు చికిత్సకు స్పందించి తిరిగి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించారు. డాక్టర్ ప్రీతిరెడ్డి సమయస్ఫూర్తితో వ్యవహరించి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. ఆన్‌బోర్డ్ మెడికల్ కిట్‌లో ఉన్న ఎమర్జెన్సీ మెడిసిన్‌ను బాధితుడికి ఇచ్చారు.
విమానం 3900 అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో ఓ ప్రాణానికి ముప్పు వాటిల్లింది. దాంతో సకాలంలో స్పందించి వృద్ధుడికి వైద్య చికిత్స అందించి, ఆయన ప్రాణాలు కాపాడిన డాక్టర్ ప్రీతిరెడ్డిపై తోటి ప్రయాణికులు, విమాన స్పందించి ప్రశంసలు కురిపించారు. విమానంలో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. డాక్టర్ అందుబాటులో లేకపోతే ఓ ప్రాణం నిలవకపోయేదన్నారు. డాక్టర్ ప్రీతిరెడ్డి సకాలంలో స్పందించడం, ఓ ప్రాణాన్ని నిలిపేందుకు ఆమె చేసిన ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వృద్ధుడు స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు హైబీపీ ఉందని చెప్పాడు. గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో గతంలో తాను కార్డియాక్ యాంజియోప్లాస్టీ చేయించుకున్నట్లు తెలిపాడు. హైదరాబాద్ లో విమానం ల్యాండ్ అయిన వెంటనే మెరుగైన వైద్యం కోసం వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. విమానం చేరే సమయానికి సిబ్బంది అంబులెన్స్ సర్వీసు ఏర్పాటు చేశారు.






















