Nidadavolu Railway Station: నిడదవోలు రైల్వే స్టేషన్‌కు మోక్షం ఎప్పుడు? నెమ్మదిగా సాగుతున్న రీ-మోడలింగ్ పనులు!
Nidadavolu Railway Station: నిడదవోలు రైల్వే స్టేషన్‌కు మోక్షం ఎప్పుడు? నెలల తరబడి కొనసాగుతున్న రీ -మోడలింగ్ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయని జనం ప్రశ్నిస్తున్నారు.

Nidadavolu Railway Station: నిడదవోలు.. ఒకప్పటి పశ్చిమగోదావరి.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. విశాఖ -విజయవాడ మెయిన్ లైన్ నుంచి తణుకు, భీమవరం, నరసాపురం, గుడివాడ లైన్ విడిపోయేది ఇక్కడి నుంచే. కోర్ గోదావరి పట్టణాలకు నిడదవోలు జంక్షన్ ముఖద్వారం లాంటిది. ప్రయాణికులనే కాకుండా అత్యంత ముఖ్యమైన మత్స్య సంపద, ఇతర గోదావరి జిల్లాల ఉత్పత్తులు ఈ మార్గం గుండానే రవాణా అవుతూ ఉంటాయి. అందుకనే ఈ స్టేషన్‌కి 20 కిలోమీటర్ల దూరంలోనే రాజమండ్రి లాంటి పెద్ద స్టేషన్ ఉన్నా.. నిడదవోలు జంక్షన్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. అయితే ఈ స్టేషన్ రీ డెవలప్మెంట్ పనుల్లో జరుగుతున్న తీవ్ర ఆలస్యంపై గోదావరి జిల్లాల్లో చర్చ జరుగుతుంది.

అమృత్ భారత స్కీమ్ కింద 27 కోట్లు కేటాయింపు
కేంద్రం ప్రకటించిన అమృత్ భారత్ స్కీం కింద ఆంధ్రప్రదేశ్‌లోని 53 స్టేషన్లను రీ డెవలప్మెంట్ చేయడం కోసం 1397 కోట్లు కేటాయించింది దక్షిణ మధ్య రైల్వే. అందులో నిడదవోలు స్టేషన్ డెవలప్మెంట్ కోసం 27 కోట్లు కేటాయించారు. ఇంతవరకు ఈ స్టేషన్‌కి మూడు ఫ్లాట్ ఫామ్స్ మాత్రమే ఉండేవి. ఇక్కడి నుంచే భీమవరం, ఏలూరు సైడ్ వెళ్లే లైన్లు విడిపోతాయి. కాబట్టి ఆయా లైన్లలో వెళ్లే రైళ్లు ఈ మూడు ప్లాట్ఫార్మ్స్‌నే పంచుకోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం పూట సింహాద్రి ఎక్స్ప్రెస్ మెయిన్ లైన్‌లో వస్తే నిడదవోలు నుంచి నరసాపురం వరకు వెళ్లే దాని లింక్ ట్రైన్ దాదాపు గంట సమయం వరకూ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ పైనే ఉండిపోతుంది.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్లాట్ఫామ్స్ సంఖ్యను ఐదుకు పెంచుతున్నారు. దానితో పాటే స్టేషన్ ముందుభాగంలో భారీ ఎలివేషన్ ఇస్తున్నారు. అలాగే స్టేషన్‌లో పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ బానే ఉన్నాయి కానీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి అనేది నిడదవోలు పట్టణ ప్రజల ఆరోపణ. నిజానికి ఈ పనులన్నీ మార్చి నెలకే పూర్తి అవ్వాల్సింది ఉంది. కానీ ఇప్పటికీ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పూర్తికాలేదు. కనీసం మరో నెలన్నర పడుతుందని అంటున్నారు.

ప్రస్తుతానికైతే స్టేషన్ లోపలికి వెళ్లే దారి కూడా సరి లేదు. అక్కడ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. నిడదవోలు స్టేషన్ ఊరు మధ్యలో ఉంటుంది. కాబట్టి అక్కడ జరుగుతున్న సిమెంట్ ఇసుక పనుల వలన ప్రయాణికులే కాకుండా స్థానిక జనం కూడా ఇబ్బంది పడుతున్నారు అన్న విమర్శ ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా నిడదవోలు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పూర్తిచేయాలని నిడదవోలు ప్రజల నుంచి డిమాండ్లు వినపడుతున్నాయి. ఈ మధ్యనే దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్ కూడా స్టేషన్ పనులను సమీక్షించి వెళ్లారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేయించాలని.. ఆలస్యం ఎందుకు అవుతుందో దృష్టి పెట్టాలని సగటు నిడదవోలు స్థానికులు కోరుతున్నారు



















