Vizag Flight Issue:విశాఖ నుంచి విజయవాడ వెళ్లాలంటే ఇంత కష్టమా? గంటా అసంతృప్తి!
Vizag Flight Issue:విజయవాడ -విశాఖపట్నం మధ్య విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. జస్ట్ 400 కిలోమీటర్ల కోసం 2 విమానాలు మారిన టీడీపీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్తలు.

Vizag Flight Issue:కారణాలు సరిగ్గా చెప్పడం లేదు గాని విజయవాడ, విశాఖపట్నం నగరాల మధ్య తిరిగే విమానాలు రద్దు కావడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రస్తుతం రాత్రిపూట రెండు సర్వీస్‌లు మాత్రమే నడుస్తున్నాయి. సాయంత్రం 6:55కీ ఇండిగో, రాత్రి 8:05కి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు మాత్రమే వైజాగ్ వాసులకు అందుబాటులో ఉన్నాయి.
ఇంతకుముందు పగటిపూట కూడా రెండు సర్వీసులు నడిచేవి. వాటిని రద్దు చేశాయి ఆయా సంస్థలు. వైజాగ్ ఎయిర్పోర్ట్ రన్ వే విస్తరణ కారణంగా అప్పట్లో ఈ సర్వీస్‌లు రద్దయ్యాయి అని కొంతమంది చెబుతుంటే.. సరైన ట్రాఫిక్ లేక అంటూ మరి కొంతమంది చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైజాగ్ నుంచి విజయవాడ వివిధ పనుల కోసం ప్రయాణించే రాజకీయ నాయకులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు, అధికారులు ఎక్కువయ్యారు. ప్రయాణ చార్జీ కూడా 4000 లోపే ఉండడంతో ఎక్కువమంది ఫ్లైట్‌నే ఆశ్రయిస్తున్నారు. అయితే వారందరికీ పగటిపూట విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పాలవుతున్నారు. పోనీ వందే భారత్ లాంటి సెమీ హై స్పీడ్ ట్రైన్‌లో వెళ్ళిపోదాం అనుకున్నా వర్కింగ్ డే మంగళవారం పూట వందే భారత్ అందుబాటులో ఉండదు.
ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) April 15, 2025
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..
ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి… pic.twitter.com/kDMWFyjs9I
అందుకే ఈ ఇబ్బందులను గుర్తు చేస్తూ టిడిపి కీలక నేత గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన ఎదుర్కొన్న ఇబ్బందిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అటు విమానాలు లేక ఇటు వందే భారత్ అందుబాటులో లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్లాలంటే హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు విమానాలు మారి ప్రయాణించాల్సి వచ్చిందని తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు : మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు
పగటిపూట వైజాగ్ నుంచి విజయవాడకు విమాన సర్వీస్ లేకపోవడంతో ఇబ్బందిపోతున్నాం అంటూ గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇదే... "ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ..
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం.. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడfతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ-విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే 2 విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి."
విమానయాన శాఖ టీడీపీ చేతిలోనే
విచిత్రం ఏంటంటే విమానయాన శాఖ టీడీపీ చేతిలోనే ఉంది. రామ్మోహన్ నాయుడు కేంద్రమంత్రిగా ఏవియేషన్ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. అందుకే గంటా శ్రీనివాసరావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను తన పోస్టులో ట్యాగ్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఇది సీరియస్ అంశమే. ఇటీవల కాలంలో విశాఖపట్నం విజయవాడ మధ్య ఫ్లైట్లో ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతోంది. అలాంటి వాళ్లకు తమ వ్యవహారాలు చెక్కపెట్టుకునేందుకు వీలుగా ఫ్లైట్ సర్వీస్ లు పగటిపూట ఉండాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై ఏవియేషన్ శాఖ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

