CLP Meeting: ప్రజల్లోకి వెళ్లే సమయం - ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం - సీఎల్పీ భేటీలో మంత్రి పదవులపైనా చర్చ
Telangana Congress :ఎమ్మెల్యేలు అంతా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ సీఎల్పీ సమావేశంలో పిలుపునిచ్చారు. మంత్రి పదవులు ఆశించేవారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదని సలహా ఇచ్చారు.

CM Revanth In CLP Meeting: ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు మన ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందన్నారు. శంషాబాద్ నోవాటెల్ లో జరిగిన సీఎల్పీ మీటింగ్ లో రేవంత్ మాట్లాడారు.
సన్నబియ్యం పథకం ఒక అద్భుతమని.. ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమన్నారు. భూ భారతిని రైతులకు చేరవేయాలని .. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్లు పథకం ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్లు అందాలని స్పష్టం చేశారు.
కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా పకడ్బందీగా పరిష్కరించామని.. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని.. ఇది మన పారదర్శక పాలనకు నిదర్శనమని గుర్తు చేశారు. జఠిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని.. మనం తీసుకున్న గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతీ గ్రామం పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలని సూచించారు. నేను కూడా మే 1 నుంచి జూన్ 2 వరకు ప్రజలతో మమేకం అవడానికే సమయం కేటాయిస్తానని ప్రకటించారు.
హెచ్ సీ యూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో ఒక అబద్ధపు ప్రచారం చేసిందని.. ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆరెస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయన్నారు. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుంది.. మనం ఎంత మంచి చేసినా.. ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందేనన్నారు. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోండి ..ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారు.. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరి అవుతున్నాడు.. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారింది ..కులగణన మోదీకి మరణశాసనం రాయబోతోందన్నారు. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెస్ ఒక్కటయ్యాయని ఆరోపించారు. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. సన్న బియ్యం మన పథకం..,మన పేటెంట్,మన బ్రాండని స్పష్టం చేశారు.
మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల వారికే సమస్యలు వస్తాయని రేవంత్ గుర్తు చేశారు. ఎంపీ చామలపై రేవంత్ మండిపడ్డారు. ఆయన పలువురు పేర్లు పరిశీలనలోకి తెస్తున్నారన్నారు. హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకుందని .. ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు వద్దని పార్టీ నేతలకు హెచ్చరికలు పంపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

