Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
Amaravati farmers problems: అమరావతి రైతుల సమస్యలకు ఆరు నెలల్లో పరిష్కారం చూపిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని హామీ ఇచ్చారు. అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారంతో ఆయన రైతులకో సమావేశం అయ్యారు.

Amaravati farmers problems will be resolved within six months: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన అన్ని సమస్యలు 6 నెలల్లో పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారం అంశంపై రైతులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం స్థానికులు, రైతులతో ప్రతి వారం లేదా రెండు వారాలకు ఒకసారి సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. అమరావతి గురించి సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు వార్తలు విశ్వసించవద్దని, చట్టపరమైన , సంక్లిష్ట సమస్యలను క్రమబద్ధంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశం రాయపుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆఫీస్‌లో 7వ అంతస్తులో ఉదయం 9 గంటలకు జరిగింది.
ఈ నెల 10న జరిగిన మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించారు. రైతులు లేవనెత్తిన కొత్త సమస్యలు, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఆందోళనలను చర్చించారు. కమిటీ సభ్యులు అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అమరావతి రైతుల సహకారం లేకుండా రాజధాని అభివృద్ధి సాధ్యం కాదు. వారి సమస్యలు మా ప్రాధాన్యత అని మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు.
సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పి. నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ తేజ అందరూ రైతుల సమస్యలు వినేందుకు వచ్చారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేసే బిల్లును పార్లమెంట్‌లో ఆమోదం పొందే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇది అమరావతి రైతులకు భద్రత ఇస్తుందని, 3 సంవత్సరాల్లో వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
𝐀𝐦𝐚𝐫𝐚𝐯𝐚𝐭𝐢 𝐈𝐬𝐬𝐮𝐞𝐬 𝐭𝐨 𝐛𝐞 𝐑𝐞𝐬𝐨𝐥𝐯𝐞𝐝 𝐖𝐢𝐭𝐡𝐢𝐧 𝟔 𝐌𝐨𝐧𝐭𝐡𝐬 – Review Committee Holds 2nd Meeting
— Amaravati News24 (@amaravatinews24) November 22, 2025
✔️ Guntur MP assured that all Amaravati–related issues will be resolved within 6 months.
✔️ Government will stay connected with stakeholders every week or… pic.twitter.com/SWtstCRxuU
రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కమిటీని నియమించారు. ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు. వారు తరచూ రైతులతో సమావేశం అయి.. వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నారు. 2019-24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరావతి రైతుల JAC నాయకులపై నమోదు చేసిన కేసులు ఇప్పటికే అలాగే ఉన్నాయి. వీలైనంత త్వరగా తొలగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీ అలాగే ఉండిపోయింది. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.




















