Viveka murder case: వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
Viveka murder case: శంకర్రావు డిస్మిస్ తర్వాత వివేకా హత్య కేసులో మరో కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది.

Viveka murder case: మాజీ మంత్రి వివేకా హత్య కేసు ఏళ్ల తరబడి సాగుతోంది. హత్య జరిగి ఇన్నేళ్లు అవుతున్నా ఇంత వరకు విచారణ కొలిక్కి రాలేదు. సీబీఐ జోక్యం చేసుకున్నప్పటికీ కేసుల తేలలేదు. ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్య జరిగినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కర్నూలు రేంజ్‌లో వి.ఆర్‌లో ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జె. శంకరయ్యను పోలీస్ సర్వీస్ నుంచి తొలగించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు సరిగా డీల్ చేయలేదని ఆయనపై డీజీపీ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికే పలు మార్లు నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో ఈ కేసులో భాగమైన వారందరిలో టెన్షన్ మొదలైంది. తర్వాత ఎవరిపై వేటు ఉంటుందా అనే చర్చ నడుస్తోంది.
ఇంతలో ప్రభుత్వం మరో అడుగు వేసింది. వివేకా హత్యకేసులో అప్రూవర్ షేక్ దస్తగిరిని జైల్లో బెదిరించిన కేసుపై ఫోకస్ చేసింది. ఆయన్ని టార్గెట్ చేస్తున్నారని తెలిసినప్పటికీ ప్రత్యర్థులను జైలులోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన వారిపై వేటుకు రంగం సిద్ధమైంది. నాటి కడప జైలు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునున్నట్టు తెలుస్తోంది.
దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన కుమారుడు డాక్టర్ దేవిరెడ్డి చైతన్య రెడ్డి వైద్య శిబిరం నిర్వహణ పేరుతో జైల్‌లోకి వెళ్లారు. వీళ్లకు నాటి అధికారులు రూల్స్ బ్రేక్ చేసి అనుమతి ఇచ్చారని ప్రధాన ఆరోపణ. జైలు సూపరింటెండెంట్ ఐఎన్ హెచ్ ప్రకాశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ కె. జవహర్‌బాబు, డీసీఎస్ డా. జి. పుష్పలత సహకరించినట్టు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి.
నాడు ఏం జరిగింది. ఎలా జరిగింది. ఈ ముగ్గురే కాకుండా ఇంకా ఎవరైనా ఇందులో భాగమై ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. కోస్తాంధ్ర రీజియన్ జైళ్లశాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ ఈ టీంను లీడ్ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసు ప్రెజెంటింగ్ అధికారిగా రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను నియమించారు. వీళ్లు దీన్ని లోతుగా విచారించి మూడు నెలల్లోపల నివేదిక ఇస్తారు.
దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. నాడు విధులను నిర్లక్ష్యం చేసిన వాళ్లంతా ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఐఎన్ హెచ్ ప్రకాశ్ నెల్లూరులోని ఏపీ స్టార్స్‌లో, జవహర్ బాబు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో, డా పుష్పలత కడప జీజీహెచ్లో పనిచేస్తున్నారు. కొత్త నియమితులైన విచారణ అధికారులు ఈ ముగ్గురితోపాటు మరికొందర్ని విచారించనున్నారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరిని 2023 అక్టోబరు 31న ఓ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ తర్వాత నవంబరు 28న అధికారులు జైల్లో వైద్య శిబిరం నిర్వహించారు. దీనికి వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డితో పాటు కడప శ్రీకర ఆసుపత్రికి చెందిన మరికొందరు వైద్యుల్ని రప్పించారు. అక్కడే చైతన్య రెడ్డి తనను బెదిరించారని దస్తగిరి కేసు పెట్టారు.





















