IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
IndiGo Flights Cancellation:ఇండిగో సంక్షోభం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటి వరకూ విమానాల రద్దు సంఖ్య వేలల్లో ఉంది. ఇలా విమానాల రద్దు శంషాబాద్‌లో ప్రయాణికుల కష్టాలపై ABP దేశం ప్రత్యేక కథనం.

IndiGo Flights Cancellation: మీ చావు మీరు చావండి.. మేమింతే.. మా తీరింతే.. అంటూ ఇండిగో సంస్ద విమాన ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. ఇండిగో సంక్షోభం మొదలై రోజులు గడుస్తున్నా, నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. తాజా ఇతర ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయం రావాల్సిన 58 , ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన 54 ఇండిగో సర్వీసులు రద్దుకావడంతో రోజుల తరబడి శంషాబాద్‌లోనే ప్రయాణికులు పడిగాపులు పడాల్సిన దుస్దితి నెలకొంది. ఇండిగో సంక్షోభం మొదలైన నాటి నుంచి నేటివరకూ వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయంటే పరిస్దితి ఎంత దారుణంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.
గంటల తరబడి శంషాబాద్‌లో ఎయిపోర్టులో వేచి ఉండాల్సిన పరిస్దితులు రావడంతో చేతిలో సెల్ ఫోన్ స్క్రీన్‌లను చూసీ, చూసి అలసిపోతున్న పరిస్దితి నెలకొంది. సమయం గడవాలంటే ఫోన్ చూడక తప్పదు. అలా ఫోన్ ఫోబియా శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులకు వెంటాడుతోంది.
ఇలా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల అవస్దలు పీక్స్ కు చేరుకున్నాయి. ఎయిర్ పోర్టుకు వచ్చేవరకూ విమాన సర్వీసుల రద్దు విషయం కనీసం ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో కష్టాలపై వారిమాటల్లోనే..
ఏబిపి దేశం: ఇండిగో సర్వీసుల రద్దుపై మీకు సమాచారం ఉందా.. ఉంటే ఎందుకొచ్చారు. ఇక్కడ ఏం చెబుతున్నారు..
మణికంఠ, ప్రయాణికుడు..: నేను హైదరాబాద్ నుంటి కోల్‌కతా వెళ్లాలి. ఉదయం నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నాను. ఇక్కడ సిబ్బందిని అడిగితే సరైన స్పందన లేదు. ఫ్లైట్ రద్దు అయ్యాయి అని మాత్రమే చెబుతున్నారు. తిరిగి రీషెడ్యూల్ చేయమని అడిగితే , మాకు ముందస్తు సమాచారం లేదని చెబుతున్నారు. గంటల తరబడి ఇక్కడే ఎదురు చూస్తున్నాం. కనీసం తిండిలేదు. తాగేందుకు మంచినీళ్లు కూడా సరఫరా చేయడంలేదు. దేశంలో ఆన్ టైమ్‌లో నడిచే పెద్ద సంస్ద ఇండిగో. మరి ఇటువంటి సంస్ద ఇలా చేస్తే, ఇంకా ఎవరిని నమ్మాలి. కనీసం ఫ్లైట్ రద్దు విషయం మాకు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తీరా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన తరువాత తెలిసి, చేసేదిలేక ఇక్కడే పడిగాపులు పడుతున్నాం. కనీసం ఈరోజు ఏ టైమ్ లోనైనా మరో ఫ్లైట్ ఏర్పాటు చేయమని అడిగితే ఇక్కడ సిబ్బంది స్పందించడంలేదు.
నేను 400 కిలోమీటర్లు , 12 గంటలు ప్రయాణించి ఫ్లైట్ కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటే తీరా వచ్చాక వీళ్లు చావుకబురు చల్లగా చెబుతున్నారు.నేను కల్‌కతా వెళ్లి అక్కడ వియత్నాంకు కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకోవాలి. అవి రెండూ రద్దు కావడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్దితి నెలకొంది. డబ్బులు కట్ చేసుకుంటున్నప్పడు ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చే కనీస బాధ్యత లేదా., టిక్కెట్ అమౌంట్ రీఫండ్ కోసం 6 రోజులు వేచి ఉండాలని చెబుతున్నారు. ఈ పరిస్దితుల్లో మరో ఫ్లైట్ ఎలా బుక్ చేసుకోవాలి. ఇదే అవకాశంగా ఇతర విమాన సర్వీసులు టిక్కెట్ రేట్లు 7 నుంచి 8 రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారు.
నవీన్ ,ప్రయాణికుడు..: నిన్న రాత్రి నా ప్లైట్ రద్దైయ్యింది. ఇప్పటికి 24 గంటలు సమయం గడిచినా ఓ క్లారిటీ రాలేదు. చేసేది లేక అదనపు భారమైనా భరించి మరో ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్లాల్సిన దుస్దితి ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే స్టే చేసిన హోటళ్లు సైతం వెకేట్ చేయాలని చెప్పేస్తున్నారు. చేసేదిలేక ఇలా ఎయిర్పోర్టు నుంచే ఆఫీస్ వర్క్ చేయాల్సిన వస్తోంది. ఇక్కడ చిన్నపిల్లలు, వృద్దుల పరిస్దితి మరీ దారుణంగా ఉంది.
రాహుల్ , ప్రయాణికుడు..: నేను ఉదయం ఫ్లైట్ రద్దైనట్లు మేసేజ్ రిసీవ్ చేసుకున్నాను. అత్యవసర పని వల్ల నేను తిరిగి మరో ఫైట్ ఏర్పాటు చేస్తారని, శంషాబాద్ ఎయిర్ పోర్టు వచ్చాను. కానీ ఇక్కడ సిబ్బంది నుంచి ఎటువంటి స్పందన లేదు. నేను శంషాబాద్ నుంచి బెంగుళూరు వెళ్లాల్సి ఉంది. ఇక్కడ ప్రభుత్వం బెంగుళూరు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేసింది. కానీ అవి ఏ సమయంలో బయలుదేరుతాయనేది క్లారిటీ ఇవ్వడంలేదు. మొదట సాయత్రం 4గంటలకు అన్నారు. ఇప్పడు రాత్రి 8 అంటున్నారు. అదికూడా సరిగ్గా నిర్దారించడంలేదు.





















