Sunstroke: వడగాల్పులకు చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఆర్థికసాయం, జీవో జారీ
Sunstroke Exgratia For kin of Deceased| వడగాల్పులకు చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థికసాయం ప్రకటించింది. ఈ మేరకు జీవో సైతం జారీ చేసింది.

Hyderabad News | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ఎండ వేడి, వడగాలుల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచింది. ఎండలు, వడగాలులు, వడదెబ్బ ప్రభావంతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం (ఏప్రిల్ 15న) ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో వడదెబ్బకు గురై, ఎండల తీవ్రతతో అస్వస్థతకు లోనై ఎవరైనా మరణిస్తే రూ. 50 వేలు చెల్లించేవారు. తాజాగా రాష్ట్ర విపత్తు సహాయ నిధి (SDRF) కింద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఎక్స్ గ్రేషియాను 50 వేల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం (జీవో ఎంఎస్ నంబర్ 5, తేదీ 15-04-2025) ఉత్తర్వులు జారీ చేసింది.

2024 ఏడాది ఇప్పటివరకూ అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. ప్రజలు వడగాలులు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక అధికారులు, వాతావరణ నిపుణులు జారీ చేసిన ఆరోగ్య సలహాలను పాటించాలని ప్రభుత్వం సూచించింది. వేసవి కాలంలో వీచే వడగాలులు వాటి ప్రభావాలపై ప్రజలకు అవగాహన పెంచడానికి సంబంధిత శాఖల ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం..
ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ వర్షాపాతం అంటే 100 శాతంలోపు వర్షాలు పడతాయని, ఈ సారి 96-104 శాతం వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది 105 శాతం కంటే అధికంగా వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేశారు.
మరోవైపు ఈ ఏడాది గతేడాదితో పోల్చితే వేసవిలోనూ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఫిబ్రవరి మొదటివారంలో ఎండలు చూసి ప్రజలు హడలెత్తిపోయారు. ఆపై మార్చిలో కొంచె ఎండలతో ప్రజలు పలు రాష్ట్రాలలో ఇబ్బంది పడ్డారు. కానీ గత ఏడాదితో పోల్చితే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఊరటనిచ్చే విషయం. ఏప్రిల్ నెలలో ఏపీ, తెలంగాణలో కొన్ని చోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. గత వారం నుంచి అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురవడంతో ఎండల నుంచి ఊరట కలుగుతోంది. వేసవి ఇంకా ముగియలేదని, ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని.. వైద్య నిపుణులు సూచించే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.






















