Agrahaaramlo Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్... కాంట్రవర్షియల్ టైటిల్‌తో కొత్త సినిమా
Ambedkar Jayanthi: అంబేద్కర్ జయంతి సందర్భంగా మంతా కృష్ణ చైతన్య హీరోగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వం వహించిన 'అగ్రహారంలో అంబేద్కర్' ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

అంబేద్కర్... బాబా సాహెబ్ అంబేద్కర్... మన భారత రాజ్యాంగ రూపశిల్పి. ఆ మహానుభావుడి 135వ జయంతి సందర్భంగా తెలుగులో 'అగ్రహారంలో అంబేద్కర్' (Agrahaaramlo Ambedkar Telugu Movie) అని ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ సైతం విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ విడుదల చేసిన అద్దంకి దయాకర్
'అగ్రహారంలో అంబేద్కర్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంఎల్‌సి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) చేతుల మీదుగా జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో ఈ మూవీ లుక్ విడుదల చేశారు.
'అగ్రహారంలో అంబేద్కర్'లో మంతా కృష్ణ చైతన్య హీరోగా నటించారు. అంతే కాదు... ఈ చిత్రాన్ని రామోజీ - లక్ష మోజి ఫిల్మ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆయన ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ... ''మెల్లగా మరుగున పడుతున్న అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా విడుదలకు మా ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మన దేశ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ప్రతి పాఠశాలలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలి'' అని పిలుపు ఇచ్చారు.
టైటిల్ వెనుక కాంట్రావర్సీ?
తమిళంలో అంబేద్కర్ భావజాలంతో, బడుగు బలహీన వర్గాలపై జరిగిన వివక్ష, అన్యాయాల నేపథ్యంలో పా రంజిత్, వెట్రిమారన్, మారి సెల్వరాజ్ తదితర దర్శకులు సినిమాలు తీస్తున్నారు. తెలుగులో ఆ తరహా సినిమాలు తక్కువ. అయితే, 'అగ్రహారంలో అంబేద్కర్' టైటిల్ అనౌన్స్ చేయడంతో కాంట్రవర్సీ ఏమైనా తలెత్తుతుందా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఫస్ట్ లుక్ కాకుండా టీజర్, ట్రైలర్ వంటివి విడుదల అయ్యాక కథపై ఒక స్పష్టత వస్తుంది. అప్పటి వరకు వెయిట్ అండ్ సి.
'అగ్రహారంలో అంబేద్కర్' చిత్రాన్ని సినిటేరియా మీడియా వర్క్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆ సంస్థ అధినేత వెంకట్ బులెమాని తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కుల మత ప్రాంత వర్గ వైషమ్యాలకు అతీతంగా... సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ మహనీయుడికి నివాళిగా 'అగ్రహారంలో అంబేద్కర్' చిత్రాన్ని తెరకెక్కించామని హీరో కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ మంతా కృష్ణ చైతన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకులు చంద్ర మహేష్, నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, 'సంతోషం' సురేష్, సీనియర్ హీరో రాంకీ, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ హరి గోవింద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

