Sunil Balusu Interview: ఓటీటీలను నమ్ముకుని సినిమా తీయకూడదు... 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' నిర్మాతలు, ఇంటర్వ్యూలో ఇంకేం చెప్పారంటే?
Arjun Son Of Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి నటించిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా వాళ్లిద్దరితో ఇంటర్వ్యూ...

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన తాజా సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun Son Of Vyjayanthi Movie). ఇందులో కథానాయకుడికి తల్లిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించారు. ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్పాతో కలిసి సునీల్ బలుసు నిర్మించారు. దీనికి ముందు శ్రీ విష్ణు 'ఓం భీమ్ బుష్', సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' సినిమాలనూ ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఏప్రిల్ 18న (శుక్రవారం) 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' థియేటర్లలోకి వస్తున్న సందర్భంగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసుతో ఇంటర్వ్యూ...
భారీ బడ్జెట్ సినిమాల విడుదల తేదీలను చాలా రోజుల ముందుగా అనౌన్స్ చేస్తున్నారు. మీరు ఏమో నెల క్రితం రేసులోకి వచ్చారు. ఈ సడన్ అనౌన్స్ వెనుక రీజన్ ఏంటి?
సమ్మర్ ఖాళీగా ఉంది. మంచి సినిమా వస్తే భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. పైగా, మాకు మా సినిమా మీద నమ్మకం ఉంది. అందుకే ఏప్రిల్ 18న సినిమా విడుదల చేస్తామని అనౌన్స్ చేశాం.
ఇప్పుడు పబ్లిసిటీ కోసం స్పెషల్ ప్లానింగ్ చేస్తున్నారు. నెల క్రితం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వల్ల టైం సరిపోయిందా?
మేం ముందుగా విడుదల తేదీ అనౌన్స్ చేసినా... ఇప్పుడు స్టార్ట్ చేసిన దాని కంటే ఒక వారం ముందు ప్రమోషన్స్ స్టార్ట్ చేసే వాడిని ఏమో!? మరీ ముందుగా ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం వల్ల ప్రేక్షకులు మరిచిపోయే అవకాశం కూడా ఉంది. పబ్లిసిటీ విషయంలో మాకు టెన్షన్ లేదు. విడుదల తేదీ అనౌన్స్ చేసినప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ (సీజీ వర్క్) కాదని కొందరు, వేర్వేరు పనులు పూర్తి అయ్యే అవకాశం లేదని కొందరు టెన్షన్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 18న సినిమా విడుదల చేయాలని కష్టపడి పని చేశాం.
కళ్యాణ్ రామ్, విజయశాంతి... ఈ కాంబినేషన్ క్రేజ్ పెంచింది. ప్రదీప్ చిలుకూరి కథతో వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినప్పుడు రియాక్షన్ ఏమిటి?
కథ రాసిన తర్వాత కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లలేదు. ఆయన కోసమే ఈ కథను మేం రెడీ చేశాం. దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో ఇంతకు ముందు ఒక వెబ్ ప్రాజెక్ట్ చేశా. అతని మీద నమ్మకం ఉంది. కళ్యాణ్ రామ్ గారితో సినిమా చేయాలని... ప్రదీప్ చిలుకూరితో రెండేళ్లు ట్రావెల్ చేసి ఈ స్క్రిప్ట్ రెడీ చేయించాం. కథ విన్నాక హీరో గారితో పాటు విజయశాంతి గారు కూడా ఒప్పుకొన్నారు. కళ్యాణ్ రామ్ గారు ప్రయోగాత్మక సినిమాలు ఎక్కువ చేస్తారు. ఆయనతో మంచి కమర్షియల్ సినిమా చేయాలని 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చేశాం.
విజయశాంతి గారి పాత్రకు, 'కర్తవ్యం' చిత్రానికి కనెక్షన్ ఏమైనా ఉందా?
లేదండీ. పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయశాంతి గారు అంటే మనకు ముందుగా కర్తవ్యం, అందులో వైజయంతి క్యారెక్టర్ గుర్తొస్తుంది. ఈ సినిమా లైన్ కూడా... 'కర్తవ్యం'లో వైజయంతి లాంటి మహిళా పోలీస్ అధికారికి కొడుకు పుడితే? వాళ్ళిద్దరి మధ్య ఒక విషయంలో సంఘర్షణ తలెత్తితే? అనే విధంగా ఉంటుంది. అందుకని విజయశాంతి గారి పాత్రకు వైజయంతి పేరు పెట్టాం. అంతే తప్ప ఆ చిత్రానికి, 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'కి కనెక్షన్ లేదు.
ప్రీ రిలీజ్ వేడుకలో కళ్యాణ్ రామ్ చేత ఎన్టీఆర్ కాలర్ ఎత్తించారు. ఆ ఈవెంట్ జరగడానికి ముందు ఆయన సినిమా చూశారు. మీతో ఏం అన్నారు?
కళ్యాణ్ రామ్ గారు కాలర్ ఎగరేసే మూమెంట్ మాకు చాలా హ్యాపీ. ఎన్టీఆర్ గారు రీ రికార్డింగ్ పూర్తికాక ముందు సినిమా చూశారు. ఆ రోజు ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పిన విషయం మాతో చెప్పారు. ఆయన ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ చూపించారు. రీ రికార్డింగ్ బాగా చేయిస్తే పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. అజనీష్ లోక్‌నాథ్ ఎక్సట్రాడినరీ రీ రికార్డింగ్ చేశారు.
ఎన్టీఆర్ సినిమాలతో కంపేర్ చేయాల్సి వస్తే ఏ సినిమాతో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'ని కంపేర్ చేస్తారు?
(నవ్వుతూ...) ఆయన సినిమాలతో కంపేర్ చేయడం ఎందుకండీ? హీరో గారి సినిమాలతో కంపేర్ చేస్తే... 'అతనొక్కడే' తరహాలో భారీ విజయం సాధించే చిత్రమిది.
కళ్యాణ్ రామ్ చేసిన గత సినిమాలలో కొన్నిటితో 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'ని కొందరు కంపేర్ చేస్తున్నారు!?
ఆయన ముందు సినిమాలకు, ఈ సినిమాకు అసలు సంబంధం ఉండదు. ఏ సినిమాతో కంపేర్ చేసి చూసినా సరే... ఇది మీకు చాలా కొత్తగా ఉంటుంది. తల్లి కొడుకుల మధ్య బాండింగ్, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఒక్కటే కాదు... సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. కోర్ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇటువంటి జానర్ సినిమా చేసినా... ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్ ప్రేక్షకులకు ఇవ్వగలిగితే విజయం సాధిస్తాం. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' అటువంటి ఎమోషన్ ప్రేక్షకులు ఇస్తుంది.
బడ్జెట్ ఎక్కువ అయినట్టుంది!? రిస్క్ అనిపించలేదా!?
లేదండీ. ప్రతి రోజూ నేను చిత్రీకరణకు వెళ్లాను. షూటింగ్ జరిగినంత సేపూ అక్కడే ఉండేవాడిని. వృధా ఖర్చు ఏది కాలేదు. ఎక్కడ ఎంత ఖర్చు చేశామో మాకు బాగా తెలుసు. సినిమాకు అవసరమైన ఖర్చు చేశాం.
సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత కథలో ఏమైనా మార్పులు - చేర్పులు చేశారా?
లేదు. ముందుగా మేం ఏ కథ అయితే అనుకున్నామో... అదే కథను తీశాం. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు.
ప్రజెంట్ సినిమాల మార్కెట్ ఎలా ఉంది? మీరు ఎగ్జిబిటర్ కూడా! ఓ నిర్మాతగా, పంపిణీదారుడిగా మీరు గమనించినది ఏమిటి?
సినిమాలు మార్కెట్ బావుంది. యాక్షన్ ఫిలిమ్, ఎమోషనల్ డ్రామా అని తేడాలు లేవు. ప్రేక్షకులకు టీజర్, ట్రైలర్, సాంగ్స్ నచ్చితే ఆ సినిమా చూడటానికి థియేటర్లకు వస్తున్నారు. లేదంటే రావడం లేదు. లక్కీగా మా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమా టీజర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ విషయంలో మేం హ్యాపీ.
సినిమా విడుదల తేదీల విషయంలో ఓటీటీల నుంచి ప్రెజర్ ఎలా ఉంది?
చాలా ఎక్కువగా ఉంది. విడుదల తేదీలను సైతం వాళ్లు డిసైడ్ చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఓటీటీలను నమ్ముకుని సినిమా తీస్తే చాలా కష్టం. నిర్మాతలు ఆ సంగతి గుర్తుంచుకోవాలి. ఓటీటీల వాళ్లు ఏవో కొన్ని సినిమాలు కొంటారు. వాళ్ళ షెడ్యూల్ తగ్గట్టు మనల్ని మన సినిమా విడుదల చేయమని అడుగుతారు. వేసవి సీజన్ వదిలేసి నాలుగు నెలల తర్వాత సినిమా విడుదల చేస్తే ప్రయోజనం ఏమంటుంది? 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ఓటీటీ డిస్కషన్స్ జరిగాయి. వాళ్లు చెప్పినట్టు విడుదల చేయాలని నేను అనుకోలేదు. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మకుండా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నా. థియేటర్లలో విజయం సాధిస్తామని నమ్మకం ఉంటేనే ఏ నిర్మాత అయినా సరే సినిమా తీయాలి. ఓటీటీలను నమ్ముకుని సినిమా తీయకూడదు.
ఓటీటీలు ఆఫర్ చేసే అమౌంట్ నచ్చి కొందరు నిర్మాతలు తమ తమ సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు!?
ఓటీటీలు పది నెలలకు గాని అమౌంట్ ఇవ్వడం లేదు. ఆ బడ్జెట్ మీద వడ్డీలకు వాళ్లు ఇచ్చేది సరిపోతుంది. అప్పుడు మనకు లాస్ కదా! థియేటర్లలో విజయం సాధిస్తే ఓటీటీ గురించి సినిమా విడుదలకు ముందుగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు.
Also Read: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

