SIT notice to KTR: ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు - కేటీఆర్‌కు నోటీసులు - శుక్రవారమే ముహుర్తం
SIT KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులోకేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది.

SIT issues notice to KTR in phone tapping case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నంది నగర్ లో ని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసులు అందించారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇప్పటికే సిట్ ఎదుట హాజరయ్యారు. జూబ్లిహిల్స్ ఏసీపీ ఆఫీసులో కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు.
బీఆర్ఎస్ హయాంలో పలువురి ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, జడ్జీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై ఈ దర్యాప్తు సాగుతోంది. జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విచారణలో హరీష్ రావు సుమారు 7-8 గంటల పాటు సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో పసలేదని, తనను కావాలనే ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. అయితే, సాంకేతిక ఆధారాలు మరియు అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ ప్రక్రియను మరింత లోతుగా నిర్వహించాలని సిట్ నిర్ణయించింది.
సజ్జనార్ నేతృత్వంలోని సిట్ సమగ్ర విచారణ
ప్రస్తుతం ఈ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావు వంటి వారు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరి విచారణలో వెలుగు చూసిన విషయాల ఆధారంగానే రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే రోజుల్లో ఈ విచారణ ఎటు దారితీస్తుందో, ఎవరికి కొత్తగా నోటీసులు అందుతాయో అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. కేసును సజ్జనార్ నేతృత్వంలోని సిట్ తీసుకున్నప్పటి నుండి మరింత దూకుడుగా విచారణ జరుపుతున్నారు.
లొట్టపీసు కేసుగా లైట్ తీసుకుంటున్న కేటీఆర్
కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసును ఒక లొట్టపీసు కేసు గా కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే పాత కేసులను మళ్లీ మళ్లీ తోడుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా నైనీ కోల్ బ్లాక్ వంటి భారీ కుంభకోణాలను బీఆర్ఎస్ ఎండగడుతున్న తరుణంలో, తమను డిఫెన్స్‌లో పడేయడానికే ప్రభుత్వం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని గంటలు విచారించినా చివరకు ఇందులో తేలేది ఏమీ ఉండదని, ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యే తప్ప ఇందులో వాస్తవం లేదని కేటీఆర్ బలంగా వాదిస్తున్నారు. పోలీసుల నోటీసులకు స్పందించి ఆయన విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.





















