Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
Naini coal block: తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్న నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై విచారణకు కేంద్రం రంగంలోకి దిగింది. ఇద్దరు అధికారుల్ని నియమించింది.

Naini coal block tenders Central inquiry: ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులు సింగరేణి ప్రధాన కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టనున్నారు. ముఖ్యంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ వంటి వివాదాస్పద నిబంధనలు ఎందుకు పెట్టారు? టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే అంశాలపై వీరు లోతుగా దర్యాప్తు చేయనున్నారు.
దర్యాప్తునకు ఇద్దరు అధికారుల్ని పంపుతున్న కిషన్ రెడ్డి
ఈ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే స్పందిస్తూ.. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని సింగరేణి బోర్డును ఆదేశించారు. అక్రమాలకు తావులేకుండా, పారదర్శకత కోసం పాత టెండర్లను రద్దు చేసి, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ నిబంధనలకు అనుగుణంగా కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ మంత్రుల మధ్య వాటాల వివాదం వల్లే ఈ టెండర్లు రద్దయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం కేవలం పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది.
సింగేరణి దోచుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపణలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు బాతు లా వాడుకుంటోందని విమర్శించారు. టెండర్లలో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని ఆయన సవాల్ విసిరారు. జాతీయ స్థాయిలో బొగ్గు టెండర్లలో ఎక్కడా లేని సైట్ విజిట్ నిబంధనను కేవలం కొంతమంది కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రతినిధుల బృందం ఇప్పుడు సింగరేణి రికార్డులను పరిశీలించి, అధికారుల నుంచి వివరణ కోరనుంది.
ఇప్పటికే టెండర్లు రద్దు చేసిన సింగరేణి
ప్రస్తుతానికి సింగరేణి యాజమాన్యం అధికారికంగా ఈ టెండర్ ప్రక్రియను నిలిపివేసింది. జనవరి 22 సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కావాల్సిన బిడ్డింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాలనాపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి పేర్కొన్నప్పటికీ, కేంద్రం పంపుతున్న విచారణ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ వ్యవహారం తదుపరి మలుపు తిరిగే అవకాశం ఉంది.





















