KTR Reaction: పోలీసులే ట్యాపింగ్ చేస్తారు - మాకేం తెలుసు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR: ట్యాపింగ్ చేసేది పోలీసులేనని తమకు నోటీసులు ఇస్తే ఏం తెలుస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. డీజీపీ శివధర్ రెడ్డి, మాజీ డీజీపీలు జితేందర్, మహేందర్ రెడ్డిలకు నోటీసులు ఇవ్వాలన్నారు.

KTR said police were doing tapping : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రత్యేక విచారణ బృందం నోటీసులు జారీ చేయడంతో సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. ఈ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ జరిగిందనే విషయాన్ని ఆయన అంగీకరిస్తూనే, దానితో తమకు సంబంధం లేదని, అంతా పోలీసులే చేశారన్నట్లుగా కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
కేటీఆర్ తన వాదనను సమర్థించుకుంటూ.. దేశ భద్రత కోసం కేంద్ర హోంశాఖ కూడా ఫోన్లను ట్యాప్ చేస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా ఎవరైనా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రలు చేస్తే, పోలీసులు వారి ఫోన్లను ట్యాప్ చేసి ప్రభుత్వానికి సమాచారం అందిస్తారని, ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందని తాము అడగమని చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ చేసేది పోలీసులు, మేం కాదు. ఒకవేళ చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ జరిగి ఉంటే ఆధారాలు చూపండి అని ఆయన సవాల్ విసిరారు. తనకు ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు బరాబర్ హాజరవుతానని, అసలు ఇప్పుడు తన ఫోన్ ట్యాప్ కావడం లేదా అని విచారణాధికారులను ప్రశ్నిస్తానని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పోలీసు వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో అత్యంత కీలక పాత్రలు పోషించిన నాటి డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి , మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చిప్రశ్నించాలని కేటీఆర్ అంటున్నారు. అంతా వారికే తెలుస్తుందని.. తమకు ఎలా తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరు అంతా ఒక నిరంతర 'కార్తీక దీపం' సీరియల్‌ను తలపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ప్రత్యేక విచారణ బృందం కూర్చోమంటే కూర్చోవడం, నిలబడమంటే నిలబడటం చేస్తోందని విమర్శించారు. తనపై నిఘా లేదని, ప్రస్తుతం తన ఫోన్ ట్యాపింగ్ కావడం లేదని అధికారులు ప్రమాణం చేసి చెప్పగలరా అని ఆయన సవాల్ విసిరారు.
ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. ప్రభుత్వ అస్థిరతకు ప్రయత్నాలు జరిగినప్పుడు లేదా అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు పోలీసులు నిఘా ఉంచే అవకాశం ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఓటుకు నోటు కేసును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఎవరైనా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అధికారులు ఆ సమాచారాన్ని సేకరిస్తే అందులో రాజకీయ నాయకులకు సంబంధం ఏముంటుంది అని ప్రశ్నించారు. పోలీసులు తమకు అందజేసిన సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో అడిగే అధికారం కూడా రాజకీయ నేతలకు ఉండదన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే హరీష్ రావును సాక్షిగా పిలిచి వేధిస్తున్నారని, ఇప్పుడు తనను కూడా అదే కోవలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్‌ను బలహీనపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి కేసులను వాడుకుంటున్నారని, ఎన్ని నోటీసులు ఇచ్చినా తాము ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే హరీష్ రావును సుదీర్ఘంగా విచారించి కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ను ఈ కేసులో కేవలం సాక్షిగా కాకుండా, ఈ కుట్రకు సహకరించిన లేదా ప్రయోజనం పొందిన వ్యక్తిగా పోలీసులు చూస్తున్నట్లు సమాచారం. పక్కా సాంకేతిక ఆధారాలతో పోలీసులు సిద్ధమవుతున్న తరుణంలో, కేటీఆర్ విచారణ ఏ మలుపు తిరుగుతుందో అన్నది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.





















