Kakinada News: కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత... విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట
ఎయిడెడ్ కళశాలల విలీన నిర్ణయం ఏపీలో ఆందోళనలకు దారితీస్తుంది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో విద్యార్థుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఐడియల్ ఎయిడెడ్ కళాశాల విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కళాశాలను ప్రైవేటీకరించవద్దని నిరసన చేశారు. సామర్లకోట రోడ్డులోని కళాశాల వద్ద నుంచి వందలాది మంది విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకొన్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్ వద్ద అడ్డంగా ఉంచిన బారీకేడ్లను తోసుకుని విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కాకినాడ కలెక్టరేట్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను అడ్డుకునేందుకు కలెక్టరేట్ పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసేశారు. దీంతో భారీ వర్షంలోనే విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన కొనసాగించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు విద్యార్థుల వద్దకు వచ్చి నిరసన విమరించాలని కోరారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.