కాళీయమర్ధనుడి అలంకారంలో సిరులతల్లి
Sri Padmavti Ammavari Brahmotsavam 2024: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగళవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కాళీయమర్ధనుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలమేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. సాయంత్రం 4.20 నుండి 5.20 గంటల వరకు అమ్మవారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించునున్నారు.