Saira Banu: 'నన్ను మాజీ భార్య అనొద్దు' - తామింకా విడాకులు తీసుకోలేదన్న రెహమాన్ సతీమణి
AR Rahman Health Update: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి సైరాబాను స్పందించారు. అయితే, తనను 'మాజీ భార్య' అనొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఓ వాయిస్ నోట్ రిలీజ్ చేశారు.

AR Rahman's Estranged Wife Saira Banu Makes Special Request: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఆదివారం ఉదయం అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన్ను డిశ్చార్చ్ చేసినట్లు చెన్నైలోని అపోలో ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. తాజాగా.. రెహమాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి సైరాబాను స్పందించారు.
'మాజీ భార్య అనొద్దు'
ఈ మేరకు వాయిస్ నోట్ రిలీజ్ చేసిన సైరా బాను (Sairabanu).. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. దేవుని దయ వల్ల రెహమాన్ ఆరోగ్యంగా ఉన్నారని.. కోలుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా.. తన గురించి చెప్పేటప్పుడు తనను 'మాజీ భార్య' అనొద్దని రిక్వెస్ట్ చేశారు. తాము ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోలేదని చెప్పారు. కొంతకాలంగా తాను అనారోగ్యంతో బాధ పడుతున్నందున.. దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. అంతేకానీ విడాకులు తీసుకోలేదని మరోసారి స్పష్టం చేశారు. తాను ఎక్కువగా ఆయన్ను ఒత్తిడి చేయాలనుకోవడం లేదని.. దయచేసి మాత్రం 'మాజీ భార్య' అనొద్దని తన వాయిస్ నోట్‌లో అభ్యర్థించారు.
29 ఏళ్ల తర్వాత వివాహ బంధానికి..
అయితే.. ఏఆర్ రెహమాన్, సైరాబాను 1995లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కాగా.. 29 ఏళ్ల తర్వాత విడిపోతున్నట్లు 2024 నవంబరులో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనిపై రెహమాన్ స్పందిస్తూ.. 'మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. ఇంతటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.' అంటూ అప్పట్లో 'ఎక్స్' వేదికగా పోస్ట్ పెట్టారు. ఆయన తీరును తప్పుబడుతూ పలు కథనాలు, కామెంట్స్ వచ్చినా వాటిని సైరా కొట్టిపారేశారు. తన భర్త ఎంతో మంచివాడంటూ చెప్పారు.
అనారోగ్యంతో ఉన్నప్పుడు సపోర్ట్‌గా..
సోషల్ మీడియాలో విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన అనంతరం రెహమాన్ తన సినిమాల్లో బిజీ అయిపోయారు. అయితే, సైరాబాను అనారోగ్యానికి గురి కాగా రెహమాన్ సపోర్ట్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. ఆమె తరఫు లాయర్ వందన షా ఈ విషయాన్ని వెల్లడిస్తూ కష్ట సమయంలో రెహమాన్ సైరాబానుకు అండగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమయంలో తనకు మద్దతుగా ఉన్నందుకు రెహమాన్‌కు సైరా సైతం కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా.. ఆయన అస్వస్థతకు గురి కాగా స్పందించిన సైరా బాను తనను మాజీ భార్య అనొద్దని రిక్వెస్ట్ చేశారు.
ఆస్పత్రి నుంచి రెహమాన్ డిశ్చార్జ్
మరోవైపు, రెహమాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం ఉదయం డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ కారణంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కాగా.. ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఇదే విషయాన్ని వైద్యులు సైతం ధ్రువీకరించారు. అటు, రెహమాన్ అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు.
Also Read: 'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

