Chandrababu: అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం: సీఎం చంద్రబాబు
Andhra Pradesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రకటించారు. ఆయన స్వగ్రామంలో మ్యూజియం, ఆధునిక పాఠశాలలు ఏర్పాటుకు కూడా హామీ ఇచ్చారు.

Potti Sriramulu | ఆంధ్ర జాతి పిత, అమరజీవి పొట్టి శ్రీరాములు 58రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డూండి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ది చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆయన నివాసం ఉన్న ఇంటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి మ్యూజియంగా అభివృద్ధి చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. ఆయన దీక్షను గుర్తు చేసుకుంటూ పొట్టి శ్రీరాములు 120వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
మ్యూజియం ఏర్పాటు
ఆమరణ దీక్షతో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడంటూ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తుచేశారు.ఆయన ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే రాజధానిలో పొట్టి శ్రీరాములు స్మారక పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని పొట్టి శ్రీరాములు స్వగ్రామంలోని ఆధునిక ఉన్నత పాఠశాలను ఆయన పేరుతో నిర్మించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగువారిని పైకి తీసుకు రావాలని కోరారు. వచ్చే ఏడాది మార్చి 16 వరకు.. అంటే ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. (1/2) pic.twitter.com/HX1SEoLdJV
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 16, 2025
ఆయనను స్మరించుకోవాలి
కర్నూలుతో ప్రారంభమైన తెలుగు రాష్ట్రం పెద్ద మనుషుల ఒప్పందంతో కలిశాయని చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్‌ను రాజధానిగా మార్చగా.. 11ఏళ్ల క్రితం జూన్ 2న మళ్లీ ఏపీ విభజన జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ ఏర్పాటుకు చాలా తేదీలు వచ్చినా.. డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసిన రోజు కాబట్టి ఆరోజున పొట్టి శ్రీరాములను మనం స్మరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి తరానికి తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జనం కోసం, తెలుగు జాతి కోసం జీవించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని సీఎం ఉద్ఘాటించారు.
నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు..
నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు కూడా తామే పెట్టామన్నారు.పొట్టి శ్రీరాములు త్యాగానికి స్పూర్తిగా రాజధాని అమరావతిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది లోపు పార్కు కూడా నిర్మించి ప్రారంభిస్తామన్నారు. ఎంతోమంది పుట్టినా కొందరే చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వాళ్ల చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గుర్తుంటారు. ఆయన కృషి వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిందన్నారు. తెలుగు భాష మాట్లాడేవారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకున్నారు.అందుకే ఈరోజు నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహించిన మార్చికి ముగింపు సభ పెడతామని చంద్రబాబు వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

