KTR Latest News: మాకు కుటుంబాలు ఉన్న సంగతి నీకు గుర్తులేదా? రేవంత్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Latest News:భార్యా పిల్లలను దూషిస్తున్నారని బాధపడుతున్న సిఎం రేవంత్ రెడ్డికి , మాకు కూడా కుటుంబాలు ఉన్న సంగతి గుర్తులేదా అంటూ ప్రశ్నించారు కేటీఆర్.

Telangana Latest News: ప్రజలు ప్రశ్నిస్తే జర్నలిస్టులపై కేసులు పెడతారా అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఆడబిడ్డలను జైలులో పెట్టడమేనా అంటూ రేవంత్ తీరుపై మండిపడ్డారు. రేవంత్ అనే పిచ్చోడి చేతిలోని రాయిలెక్క తెలంగాణ మారిందని విమర్శించారు. 420 బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి, ఇప్పుడు జనం నిలదీస్తుంటే సిఎం తట్టుకోలేకపోతున్నాడని, ఒకప్పుడు రేవంత్ మాట్లాడే బజారు భాషలోనే జనం ప్రశ్నిస్తే తప్పేముందన్నారు. ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో చంచల్‌గూడ జైల్లో ఉన్న జర్నలిస్టులు రేవతి, తన్వియాదవ్‌ను పరామర్శించిన కేటీఆర్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డికి మా కుటుంబం గుర్తు రాలేదా ?
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తన భార్యా పిల్లలను దూషిస్తున్నారని బాధపడుతన్నారు, గతంలో తమ మీద అడ్డగోలుగా అవాస్తవాలు మాట్లాడిన సంగతి మర్చిపోయారా అని కేటీఆర్ ప్రశ్నించారు. తన పిల్లల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు రేవంత్‌కు కుటుంబం గుర్తుకురా లేదా అని నిలదీశారు. రేవంత్ మాట్లాడితే మంచిది, అవే మాటలు వేరొకరు మాట్లాడితే మంచిది కాదా? అన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలన్నారు కేటీఆర్. రేవంత్ మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్నందుకే జర్నలిస్టులపై ముఖ్యమంత్రి అక్కసు వెళ్ళగక్కుతున్నారని మండిపడ్డారు. జనం నిలదీస్తే.. ప్రజలు ప్రశ్నిస్తే జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతారా? జైలుకు పంపుతారా? ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్న డిజిటల్ జర్నలిస్టులపై అక్రమ కేసులు, దాడులతో వేధించడం ప్రజాస్వామ్య హననమే” అన్నారు కేటీఆర్. ఒకరిద్దరు జర్నలిస్టులపైనే కాదు పదుల సంఖ్యలో జర్నలిస్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఎంతో గొప్పగా చెప్పిన మొహబత్‌కి దుకాణ్ అంటే ఇదేనో కాదో చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను బట్టలు ఊడదీసి కొడతానని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. ప్రజల ఆక్రోశాన్ని చూపించడమే రేవతి, తన్వి యాదవ్ చేసిన తప్పా? అని ప్రశ్నించిన కేటీఆర్, రేవంత్ నియంతృత్వ పోకడలను అడ్డుకోకుంచే మిగతా జర్నలిస్టులకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అక్రమాలపై మీడియా గొంతు విప్పి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ...
కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే అదేదో సంక్షేమ రాజ్యం అని ప్రజలు భ్రమపడి, కెసిఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అపోహ పడ్డారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులే అన్న సంగతి మరోసారి స్పష్టమైందని ఆరోపించారు. 6 గ్యారంటీలతోపాటు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యమని పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, ప్రజలు గొంతు విప్పితే మాత్రం తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలు అంతా ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నారని చెప్పారు. జైల్లో పెడతామంటే భయపడ్డానికి బీఆర్ఎస్‌లో ఎవరూ లేరన్న కేటీఆర్, తామంతా ఉద్యమాల నుంచి వచ్చామన్నారు. ప్రభుత్వ బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళంకాదని స్పష్టం చేశారు. అధికారమదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డికి రేపు కచ్చితంగా తగిన శాస్తి జరుగుతుందన్నారు. ఆయనకు వంతపడే వాళ్లకు కూడా సేమ్ టూ సేమ్ జరుగుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రేవంత్ అసమర్ధత వల్లే తెలంగాణకు ఆదాయం తగ్గింది..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 71 వేల కోట్ల ఆదాయం తగ్గిందన్న రేవంత్ రెడ్డి, అన్ని రంగాల్లో తెలంగాణ విఫలమైన సంగతిని స్వయంగా ఒప్పుకున్నారని కేటీఆర్ చెప్పారు. రేవంత్ అసమర్థ విధానాల వల్లనే ఆదాయం తగ్గిందన్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణలో అన్ని రంగాలు చాలా బాగున్నాయి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి, 71 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గిందో ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణ రైజింగ్ కాదు తెలంగాణ ఈజ్ ఫాలింగ్ అన్న చేదు నిజాన్ని ముఖ్యమంత్రి కన్ఫర్మ్ చేశారన్నారు కేటీఆర్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

