తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఆధారాలు చూపకపోతే శిక్షకు సిద్ధపడాల్సి వస్తుందని అన్నారు.
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
పంద్రాగస్టు రోజున సైతం సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు, బూతులు మాట్లాడుతున్నారని, తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపకపోతే పరువునష్టం దావా వేస్తారనని హరీష్ రావు హెచ్చరించారు.

- హరీష్ రావు రేవంత్ రెడ్డికి పరువు నష్టం దావా హెచ్చరిక.
- స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై సీఎం తీరును ఖండించారు.
- నీటి సమస్యలు, ప్రాజెక్టుల ఆలస్యంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
- ఫీజు బకాయిలు, విద్యుత్ సరఫరాపై సీఎంను నిలదీశారు.
Harish Rao vs Revanth Reddy | సిద్దిపేట: తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే పరువు నష్టం దావా వేసి కోర్టు లాగుతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హెచ్చరించారు. తన గురించి పనికిమాలిన మాటలు మాట్లాడిన వారిపై పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగుతానని, చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపకపోతే శిక్షకు సిద్ధపడాల్సిందే అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం కాదని, ప్రజలు మనకంటే తెలివైన వారు.. ప్రతిసారి మోసపోరని పేర్కొన్నారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే వదలిపెట్టేది లేదు..
సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజున స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాల్సింది పోయి, సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయ మాటలు మాట్లాడటం శోచనీయమన్నారు. సీఎంగా పదవిలో ఉన్నప్పటికీ ఇంకా అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తూ, స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు. నీ దోపిడి, మైనింగ్ స్కామ్, 22 ఏ దోపిడీ గురించి, రైతుల ఎరువులు, రైతుబంధు, రుణమాఫీ, పిల్లల స్కాలర్ షిప్స్, హాస్టల్ స్కామ్ గురించి ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజల గొంతుకగా కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ఆధారాలు చూపకుండా అసత్య ఆరోపణలు చేస్తే, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
నా గురించి పనికిమాలిన మాటలు మాట్లాడిన వారిపై పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగుతాను
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2026
మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపకపోతే శిక్షకు సిద్ధపడాల్సిందే
– హరీష్ రావు pic.twitter.com/q5cGQqpj71
కొత్త నిధులు, హామీలు లేకపోవడం దారుణం..
ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన మంచినీటి సమస్యలపై గానీ, నియోజకవర్గ అభివృద్ధికి కొత్త నిధుల కేటాయింపుపై గానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయడం మూలంగా మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తిందని, నారాయణఖేడ్‌లో 2, 3 రోజులకొకసారి నీళ్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండాకాలంలో కూడా కేసీఆర్ ప్రతి తండాకూ తాగునీరు అందించారని గుర్తుచేసిన ఆయన, ప్రత్యామ్నాయ నీటి వసతులపై సీఎం ఎలాంటి హామీ ఇవ్వలేదని విమర్శించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సాగునీటి అవసరాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూలన పడేసిందని హరీశ్ రావు ఆరోపించారు. జిల్లాకు వచ్చిన సందర్భంగానైనా ఆ ప్రాజెక్టుల పనులను త్వరగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని సీఎం ప్రకటిస్తారని ఆశిస్తే, కేవలం పనికిరాని మాటలతో ప్రసంగాన్ని ముగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీ దోపిడి గురించి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డిలే చెప్తున్నారు. నువ్వు బీఆర్ఎస్ నేతల్ని తిడితే ప్రజలు నీ దోపిడీని మర్చిపోతారు అనుకుంటున్నావా. 24 గంటల కరెంట్ ఇస్తున్నానని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా రైతులకు 12 గంటలకు మించి కరెంట్ ఉంటలేదు. అనేక గ్రామాల్లో రైతులు కరెంట్ కోసం సబ్ స్టేషన్ల ఎదుట ధర్నా చేస్తుంటే, కరెంట్ ఇస్తున్నానని బుకాయిస్తున్నారు – హరీష్ రావు
ముక్కు నేలకు రాస్తావా.. సారీ చెబుతావా రేవంత్ రెడ్డి !
ఇప్పటినుండి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తా అని తెలంగాణ సీఎం అంటున్నాడు. మరి గత రెండున్నరేళ్ల బకాయిలు ఎవరు ఇస్తారో చెప్పాలి. గడిచిన రెండున్నరేళ్లలో కూడా రేవంత్ రెడ్డే కదా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి. ఆ సమయంలో చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఏంటని బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నాను. కరోనా వచ్చినా, పెద్దనోట్లు రద్దు చేసిన సమయంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19,700 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పెండింగ్ 1400 కోట్లు కూడా మేం చెల్లించాం. నీలం తుఫాన్ రూ.500 కోట్లు కాంగ్రెస్ బాకీ పెడితే.. బీఆర్ఎస్ ప్రభుత్వమే చెల్లించిందని మరిచిపోయావా. ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చిందే కాంగ్రెస్ అంటావు. మరి నువ్వెందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించ లేదు?. తప్పయిపోయిందని ముక్కు నేలకు రాస్తావా. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతావా. సిగ్గు ఎగ్గూ లేకుండా పండ్రాగస్టు రోజు కూడా వెకిలి మాటలు, బూతులేనా. – హరీష్ రావు
రేవంత్ రెడ్డి క్షుద్రపూజల ఆరోపణలు..
హరీష్ రావు తనపై, తన ప్రభుత్వంపై క్షుద్ర పూజలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఆ ఆలయం అలాంటి విషయాలకే ఫేమస్ అని, అగ్గిపెట్టే రావు, అఘోరా రావులు తనపై కుట్ర చేస్తున్నారనడానికి అదే నిదర్శనం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని, వర్షాలను అడ్డుకునేందుకు చేతబడులు, క్షుద్రపూజలు చేయడం బీఆర్ఎస్ పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేశారు.
Frequently Asked Questions
బీఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఏమని సవాల్ విసిరారు?
సీఎం రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంపై హరీష్ రావు ఎందుకు విమర్శలు చేశారు?
స్వాతంత్ర్య సమరయోధుల స్మరణ, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడకుండా, సీఎం చిల్లర రాజకీయ మాటలు మాట్లాడారని హరీష్ రావు మండిపడ్డారు. ఇది శోచనీయమని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లాకు సంబంధించి హరీష్ రావు లేవనెత్తిన ప్రధాన సమస్యలేంటి?
సీఎం మంచినీటి సమస్యలు, కొత్త నిధుల కేటాయింపులపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. సింగూరు ప్రాజెక్టు ఖాళీ చేయడం వల్ల తాగునీటి ఎద్దడి తలెత్తిందని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై హరీష్ రావు అభ్యంతరం ఏమిటి?
గత రెండున్నరేళ్ల బకాయిలు ఎవరు ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ కాలంలో సీఎం రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అని గుర్తుచేస్తూ, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు























