ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు పోలీసుల కారు డిక్కీలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఇది ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
SI Caught With Ganja | బాపట్ల జిల్లా అద్దంకి వద్ద ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారు ఆటోను ఢీకొట్టింది. కారు డిక్కీలో గంజాయి ఉండటంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

- అద్దంకి సమీపంలో పోలీసు కారు ప్రమాదం; డిక్కీలో గంజాయి లభ్యం.
- ఇద్దరు ఎస్సైలు ప్రయాణించిన వాహనంలో గంజాయి దొరకడం కలకలం రేపింది.
- పోలీసులు తనిఖీకి అడ్డుపడి, ఎస్సైలను పంపడంపై ప్రజల ఆగ్రహం.
Addanki Ganja Allegations | అద్దంకి: ఏపీలో గంజాయి బ్యాచ్ అనే పదం గత కొన్నేళ్లుగా ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలో పలుచోట్ల గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడటం, హత్యలు చేసి జైలుకు వెళ్తున్న ఘటనలు జరుగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్ మీద కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లు చెబుతోంది. కానీ పోలీసుల వాహనంలోనే గంజాయి తరలిస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్డు ప్రమాదానికి గురైన పోలీసుల కారు (AP 27 CB 4789 ) డిక్కీ తెరిచి చూసిన స్థానికులు గంజాయి గుర్తించి షాకయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగుళూరు ఎస్సై నాగమల్లేశ్వరావు సివిల్ దుస్తుల్లో స్విఫ్ట్ డిజైర్ కారులో బల్లికురవ నుండి అద్దంకి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న డిజైర్ కారు ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రమాదం జరిగిన అనంతరం పోలీసులు ప్రయాణిస్తున్న కారు డిక్కీలో గంజాయి ఉన్నట్లు గమనించిన స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఘటనా స్థలానికి అద్దంకి సీఐ సుబ్బరాజు చేరుకోగా, కారు డిక్కీని తెరవకుండా అడ్డుకున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డిక్కీలో గంజాయి ఎందుకు ఉందని, పోలీసులు గంజాయి వాడుతున్నారా, లేక సీజ్ చేశారా .. అది ఎక్కడినుంచి వచ్చిందని అడిగితే కూడా ప్రజలకు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అక్కడ పోలీసులు, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గంజాయి దొరికిన పోలీసులు ప్రయాణిస్తున్న కారును పూర్తిగా తనిఖీ చేయాలని గ్రామస్థులు పట్టుబట్టినప్పటికీ, పోలీసులు ప్రమాదంలో ఉన్న ఇద్దరు ఎస్సైలను మరో కారులో అక్కడి నుండి పంపించివేశారు. స్థానిక టీడీపీ నాయకుడి కారులో ఆ ఇద్దరు ఎస్సైలను అక్కడి నుంచి పంపించివేశారని స్థానికులు ఆరోపించారు. పోలీసులు వెళ్తున్న వాహనం డిక్కీలో గంజాయి లభించడం, పోలీసులు దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో పాటు కారు చెక్ చేయనీయకుండా ప్రజలను అడ్డుకోవడం, పనిలో పనిగా ఇద్దరు ఎస్సైలను అక్కడి నుంచి పంపించివేయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Frequently Asked Questions
అద్దంకి వద్ద ప్రమాదానికి గురైన పోలీసుల వాహనంలో ఏమి లభించింది?
ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్న పోలీస్ అధికారులు ఎవరు?
బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగుళూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు సివిల్ దుస్తుల్లో కారులో ప్రయాణిస్తున్నారు. ప్రమాదం తర్వాత వారిని మరో కారులో పంపించేశారు.
పోలీసులు గంజాయిపై స్పష్టత ఇవ్వకపోవడంతో స్థానికుల స్పందన ఎలా ఉంది?
గంజాయి లభించడంతో స్థానికులు కారును తనిఖీ చేయాలని పట్టుబట్టారు. పోలీసులు స్పష్టత ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ట్రెండింగ్ వార్తలు























