Dil Raju: 'గేమ్ ఛేంజర్' ఈవెంట్‌కు వచ్చిన ఇద్దరు మృతి... అభిమానులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన దిల్ రాజు
Dil Raju: 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ కు వచ్చి ఇద్దరు మృతి చెందడంపై స్పందిస్తూ, వారి కుటుంబాలకు నిర్మాత దిల్ రాజు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే టీఎస్ లో టికెట్ రేట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్' (Game Changer). ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి అడుగు పెట్టబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటుంది 'గేమ్ ఛేంజర్' టీం. శనివారం రోజు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ గా ఆహ్వానించి, మేకర్స్ ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈవెంట్ అంతా బాగానే జరిగింది అని ఊపిరి పీల్చుకునే లోపే, ఈవెంట్ కి వచ్చి వెళ్తున్న టైంలో ఓ ఇద్దరు మెగా అభిమానులు చనిపోయారనే వార్త షాక్ కి గురి చేస్తోంది. ఈ విషయంపై స్పందిస్తూ దిల్ రాజు వారికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఈవెంట్ తర్వాత ఇద్దరు మృతి... దిల్ రాజు సాయం
తాజా సమాచారం ప్రకారం శనివారం రాత్రి రాజమండ్రిలో జరిగిన 'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక, ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో ఇద్దరు మెగా అభిమానులు ప్రమాదవశాత్తు మరణించినట్టుగా తెలుస్తోంది. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) అనే పేర్లు గల యువకులు ప్రమాదవశాత్తు మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు మీడియా సమక్షంలో స్పందిస్తూ, ఆ ఇద్దరి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అంతేకాదు వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని వెల్లడించారు. ఆ ఇరువురి కుటుంబాలకు వెంటనే 5 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇక మరోవైపు ఈవెంట్లో కొందరు పబ్లిక్ కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లను ధ్వంసం చేయడంతో, ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా జరిగిన 'పుష్ప 2' వివాదం తర్వాత మళ్లీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, అది వివాదాస్పదం కాకుండా దిల్ రాజు వెంటనే స్పందిస్తూ, వారికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎంకి స్పెషల్ థాంక్స్...
తాజాగా 'గేమ్ ఛేంజర్' నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ ను నిర్వహించి, ఈ సినిమాకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూనే, సంక్రాంతి సినిమాలకు సంబంధించి టికెట్ ధరలు, బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకుండా తాము అడగగానే ముఖ్య అతిథిగా ఈవెంట్ కు హాజరైనందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పారు. తన జీవితంలోని ఇది గొప్ప ఈవెంట్ అంటూ దిల్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ ధరలు...
ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు ఏపీలో పెరగ్గా, తెలంగాణలో టికెట్ ధరల విషయమై దిల్ రాజు స్పందించారు. "సీఎం గారు మొన్న టికెట్ రేట్లు పెంచను అన్నారు. అలాగే ఆయన మాకు కావాల్సినవి అన్ని ఇస్తా అని అన్నారు. అందుకే టికెట్ రేట్లు కావాలి అని అడగబోతున్నాము. ఆయన టికెట్ రేట్లు పెంచుతారని ఆశతో ఉన్నాను. మొన్న ఆయన స్పీచ్ లో అన్నీ తీసుకోండి అని అన్నారు. అది చూశాక కూడా అడగకపోతే ఆకలేసిన అమ్మను అన్నం పెట్టమని అడగనట్టే" అంటూ టికెట్ రేట్ల గురించి మరోసారి ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించబోతున్నట్టు వెల్లడించారు.