Educational Initiatives: పాఠశాల విద్యార్థులకు లైంగిక విద్య, కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం
School Education: కర్ణాటకలోని పాఠశాలల్లో 8వ తరగతి నుంచి 12వ తరగతుల విద్యార్థులకు లైంగిక విద్యను వచ్చే విద్యాసంవత్సరం నుంచి బోధించనున్నట్లు కర్ణాటక విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.

Sex Education for School Students: పాఠశాల స్థాయి విద్యకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు లైంగిక విద్య(Sex Education)ను ప్రవేశపెట్టనుంది. కౌమారదశలో ఉన్న విద్యార్థులకు శారీరక (Physical), భావోద్వేగ (Emotional),హార్మోన్ల మార్పులు (Hormonal imbalance) గురించి కనీస పరిజ్ఞానం ఉండాల్సిన అవసరముందని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో పాఠశాలల్లో లైంగిక విద్యను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం నిలిచింది. వీటితోపాటు సైబర్ పరిశుభ్రత, విద్యార్థుల వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు..
పాఠశాల విద్యలో 8వ తరగతి నుంచి 12వ తరగతుల విద్యార్థులకు లైంగిక విద్యను వచ్చే విద్యాసంవత్సరం నుంచి బోధించనున్నట్లు కర్ణాటక విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. విద్యార్థుల్లో కౌమార దశలో చోటుచేసుకునే శారీరక, భావోద్వేగ, హార్మోన్ల మార్పుల గురించి అవసరమైన జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వైద్య నిపుణుల ద్వారా వారానికి రెండుసార్లు లైంగిక విద్య తరగతులు నిర్వహించనున్నాట్లు మంత్రి చెప్పారు. ఏడాదికి రెండుసార్లు విద్యార్థులు ఆరోగ్యం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పరిశుభ్రతపై విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది అవగాహన కల్పిస్తారని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది విద్యార్థులకు పరిశుభ్రత, అంటు వ్యాధులు, డ్రగ్స్ వినియోగం, ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తారని చెప్పారు.
వాటిపైనా ప్రత్యేక తరగతులు..
లైంగిక విద్యతో పాటు.. డిజిటల్ ఎడిక్షన్, ప్రీమెచ్యూర్ సెక్సువల్ యాక్టివిటీ, టీనేజ్ ప్రెగ్నెన్సీ వంటి సమస్యలపై ప్రత్యేక తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నైతిక విద్య(Moral Education) సబ్జెక్టును తప్పనిసరి చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారానికి రెండుసార్లు సెషన్‌లు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పాఠ్యాంశాలు సమగ్రత, నిజాయితీ,సహనం వంటి విలువలను విద్యార్థుల్లో అలవర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

